ఇల్లు లేదు..కారు లేదు..ఆస్తి రూ.300 కోట్లు

 

రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అఫిడవిట్లో పొందుపరిచే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక్కోసారి నిజామా అనేలా నమ్మశక్యం కాకుండా ఉంటాయి. తాజాగా ఓ కాంగ్రెస్ నేత అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తులు,అప్పుల వివరాలు అలానే ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి అఫిడవిట్‌ పత్రాల్లో చూపించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న లెక్కల ప్రకారం కోమటిరెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ. 300 కోట్లకు పైమాటే. అయితే ఆయనకి సొంత ఇల్లు గానీ,కారు గానీ లేదట.

కోమటి రెడ్డి పేరు మీద సుమారు రూ. 7కోట్ల విలువైన కమర్షియల్ భవనాలు, ఆయన భార్య పేరున సుమారు రూ. 13 కోట్లు విలువ చేసే రెండు భవనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.కానీ ఆయన పేరు మీద సొంత ఇల్లు గానీ,కారు గానీ లేవని పేర్కొన్నారు. కోమటిరెడ్డి సంవత్సర ఆదాయం రూ.34లక్షలు, ఆయన భార్య లక్ష్మీ సంవత్సర ఆదాయం రూ.1.1కోట్లు, చరాస్తులు...రాజగోపాల్ రెడ్డి పేరిట రూ.5కోట్లు, లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.261కోట్లు, స్థిరాస్తులు...రాజగోపాల్‌రెడ్డి పేరిట రూ. 19.5 కోట్లు, లక్ష్మీ పేరిట రూ. 28 కోట్లు, అప్పులు...రాజగోపాల్ పేరిట రూ. 23 లక్షలు లక్ష్మీ పేరిట రూ. 6.4 లక్షలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై ఇంతవరకూ ఎలాంటి క్రిమినల్ కేసు లేదని అఫిడవిట్లో స్పష్టం చేశారు.