ఐపీఎల్ -17..బెంగళూరుకు మరో ఓటమి.. కోల్ కతా చేతిలో చిత్తు

ఐపీఎల్ సీజన్ - 17లో భాగంగా  బెంగళూరు వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన  మ్యాచ్ లో కోల్ కత నైట్  రైడర్స్ విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి 182  పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లకు కోల్ కతా లక్ష్యాన్ని ఛేదించింది.  

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నైట్ రైడర్స్ కు శుభారంభం దక్కలేదు. మాంఛి ఫాంలో ఉన్న డుప్లెసిస్ హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మిచెల్ స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే కింగ్ కోహ్లీ మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించాడు.  డుప్లెసిస్ ఔటవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన గ్రీన్ తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ దూకుడు పెంచాడు. వీరిద్దరూ కోల్ కతా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్ సజావుగా సాగుతోందనుకుంటున్న తరుణంలో  రస్సెల్ బౌలింగ్ లో గ్రీస్ ఔటయ్యాడు. గ్రీస్ 21 బంతుల్లో నాలుగు ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేశారు. గ్రీస్ ఔట్ అవ్వడంతో మ్యాక్స్ వెల్ క్రీజ్ లోకి వచ్చాడు. అయితే మ్యాక్స్ వెల్ ఆరంభం నుంచీ కూడా తడబడుతూనే ఆడాడు. తనదైన శైలిలో స్ట్రోక్ ప్లే చేయడంలో విఫలమయ్యాడు. రెండు లైఫ్ లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

మరో వైపు కోహ్లీ సాధికారికంగా ఆడుతూ 36  బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.  మాక్స్ వెల్ మాత్రం 19 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తో 28 పరుగులు చేసి నరైన్ బౌలింగ్ లో రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తరువాత బెంగళూరు వరుసగా పటేదార్, అనూజ్ రావత్ లు వెంటవెంటనే ఔటయ్యారు.  కోహ్లీ అద్భుత బ్యాటింగ్ కారణంగా  బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కోహ్లీ 59 బంతుల్లో   4 ఫోర్లు, 4 సిక్సర్లతో  83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  

 183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా మొదటి ఓవర్ నుంచే పరుగుల వేట మొదలెట్టేసింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 15 పరుగులు సాధించింది.  యశ్ దయాల్ వేసిన రెండో ఓవర్ లో 14 పరుగులు రాబట్టింది. మొత్తం మీద కొల్ కతా దూకుడుకు మయాంక్ బ్రేక్ వేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో దూకుడు మీద ఉన్న నరేన్ ను క్లీన్ బౌల్డ్ చేశారు. నరేన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.  ఆ తరువాత 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ గ్రీన్ పట్టిన అద్భుత క్యాచ్ కు వెనుదిరిగాడు. అయితే ఆ తరువాత వచ్చిన వెంకటేశ్ అయ్యరే చెలరేగి ఆడటంతో కోల్ కతా  పరుగుల వరద పారించగలిగింది. ఈ క్రమంలో 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  అయితే  శ్రేయస్ అయ్యర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బెంగళూరును చిత్తు చేసింది.