వలస నేతలపై విసుర్లు.. నవ్వుల పాలౌతున్న కేసీఆర్

బీఆర్ఎస్ రాజకీయం అలాగే ఉంటుంది. అధికారంలో ఉన్నంత కాలం తాము చేసిందే రైట్ అన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు విపక్షంలో ఉండి తాము నాడు చేసిన పనులలో తప్పిదాలను అంగీకరిస్తూనే వాటి వల్ల కొంపలేం మునిగిపోయాయని మమ్మల్ని ఓడించారంటూ ప్రజలను దబాయించడానికి ప్రయత్ని స్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కుమారుడు  కల్వకుంట్ల తారకరామారావు మాటలు, చేతలూ సొంత పార్టీ నేతలూ కేడర్ నే విస్మయానికి గురి చేస్తున్నాయి. ఓటమిని దిగమింగుకోలేక అసలే సతమతమౌతుంటే.. పార్టీ నుంచి జోరందుకున్న వలసలు ఆయనను మరింత అసహనానికి గురి చేస్తున్నట్లున్నాయి.

అధికారంలో ఉండగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒక హోదా, ఒక అధికారం, కాబోయే సీఎంను అన్న ధీమా ఇచ్చిన పదవి. ఇప్పుడు విపక్షంలో ఉండగా అదే  పదవి కేటీఆర్ కు ముళ్ల కిరీటంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో లోక్ సభ ఎన్నికలకు పార్టిని సమాయత్త పరచాల్సిన బాధ్యత కేటీఆర్ పైనే పడింది. ఆయన కూడా ఆ సమన్వయ కార్యక్రమాలను ఏదో మమ అన్నట్లుగానే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది.  తప్పని సరి అన్నట్లుగానే కేటీఆర్  పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అలా నిర్వహిస్తున్న సమావేశాల్లో సమీక్షకు అవకాశమే లేదన్నట్లుగా కేటీఆర్ తీరు ఉంది. ప్రతి సమావేశంలో ఆయన మాట్లాడుతున్న తీరు పార్టీ శ్రేణులలో కూడా అసహనానికి కారణమౌతోంది.  రెండు పిల్లర్లు కుంగితే  బ్రహ్మాండం బద్దలైపోతుందా? ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ జరగితే జరిగుండొచ్చు..? దానికి ఇంత యాగీ చేయాలా? అంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను, పలుకుబడిని మరింత దిగజారుస్తున్నాయని పార్టీ క్యాడరే అంటోంది.  

ఇక పార్టీని వీడి వెడుతున్న వారిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న శాపనార్ధాలూ పార్టీని ఇన్ టాక్ట్ గా ఉంచడంతో తన ఫెయిల్యూర్ ను ఎత్తి చేపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీని కష్టకాలంలో వీడి వెడుతున్న వారికి పార్టీ తలుపులు ఎప్పటికీ మూసుకుపోయినట్లేనని ఆయన అనడంపై పార్టీ శ్రేణులే నవ్వుకుంటున్నాయి. అధికారంలో ఉండగా పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకున్న పాపమే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను వదిలి వచ్చిన వారంతా  ఆయా పార్టీలు కష్టకాలంలో ఉండగా వదిలేసి వచ్చిన వారే కదా.. ఇప్పుడు పార్టీని వదిలి వెడుతున్న వారిలో అత్యధికులు అటువంటి వారే కదా అని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ప్రత్యర్థి పార్టీలను నామరూపాల్లేకుండా చేయాలన్న ఉద్దేశంతో నాడు చేసిన సర్పయాగమే ఇప్పుడు బీఆర్ఎస్ ను ఖాళీ చేసేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అండగా నిలిచిన ఉద్యమ కారులందరినీ పక్కన పెట్టేసి ఇక బీఆర్ఎస్ ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి మరీ  పక్క పార్టీల నుంచి  వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక  అలా వచ్చిన వారంతా వలసబాట పడుతుంటే వారిని తప్పపట్టడం వింతగా ఉందని అంటున్నారు. అయినా అధికారం శాశ్వతం అన్న భ్రమల్లో ఊరేగిన వారికి ఆ అధికారం కోల్పోయిన తర్వాత అసహనం సహజమేనని సెటైర్లు వేస్తున్నారు.