కేజ్రీవాల్ బాటలో కోదండరాం.. అధికారం మాదేనంటున్న ప్రొఫెసర్!!

దేశం మొత్తంలో హాట్ టాపిక్ గా మారుమ్రోగుతున్న పేరు  అరవింద్ కేజ్రివాల్. అందరి నోళ్లలో ఇప్పుడు కేజ్రీవాల్ పేరు నానుతుంది. వరుసగా మూడోసారి ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకున్న ఆప్ పార్టీ దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు రోల్ మోడల్ గా నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాం ఇప్పుడు కేజ్రీవాల్ తమకు ఆదర్శమంటున్నారు. ఓటములు ఎన్ని వచ్చినా నిరాశ చెందాల్సిన పని లేదని భవిష్యత్తు తమదేనని చెబుతున్నారు. 

కేంద్రం చేతుల్లో అనేక అవమానాలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ ప్రజల్లో తన కార్యదక్షతను నిరూపించుకున్నారు. అలాగే.. కేంద్రం తన అధికారంతో పెత్తనం చేసినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఎదురొడ్డి నిలబడ్డారు. అదే తమకు ఆదర్శమని కోదండరాం గారు అంటున్నారు. తెలంగాణలో కూడా మౌలిక అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మ గౌరవం, ఉద్యమ ఆకాంక్షల సాధన కేంద్రంగానే రాజకీయాలుండాలి. కుల, మతపరమైన భావోద్వేగాలు అర్థబలం, అంగబలం విసిరే మాయాజాలానికి తెరపడే రోజులొస్తాయి. అప్పటి వరకూ కాస్త ఓపిక పట్టాలని ప్రొఫెసర్ గారు క్లాసులు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా ఢిల్లీలో ఆప్ అధికారం లోకి వచ్చాక చేసిన పని కాదు. అసలు ఆ పార్టీ నిర్మాణానికి ముందు చేసిన కార్యాచరణ గురించి బోధిస్తే బావుంటుందని కోదండరాం గారు పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీని ఎలా నిర్మించాలనే విషయాన్ని పక్కన బెట్టి ఇవన్నీ ఎందుకు అంటున్నారు. పార్టీ స్థాపించే కంటే ముందే కేజ్రీవాల్ తన సన్నిహితులతో కలిసి సిద్ధం చేసుకున్న ప్రణాళికల గురించి కోదండరాం పార్టీ వాళ్లతో చర్చిస్తే బెటర్ అని చెవులు కొరుక్కుంటున్నారు. అంతేగానీ పార్టీ పెట్టగానే రాజ్యాధికారమే లక్ష్యం పవర్ లోకి రావాలంటే ఎలా అని ప్లాన్ వేసుకొని ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్ ఆదర్శమని క్లాసులు చెప్తే వర్కవుట్ అవ్వదని కార్యకర్తలు ఎవరికీ వినిపించకుండా మాట్లాడేసుకుంటున్నారు. ఒక్కసారి అధికారం లోకి వచ్చిన పార్టీలు ఆ తర్వాత ఏం చేసినా ఆదర్శంగానే కనిపిస్తాయిని అక్కడకు వెళ్లాలంటే ముందు పార్టీ నిర్మాణం సరిగా జరగాలనీ చర్చోపచర్చలు సాగుతున్నాయి. అసలు క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పట్టుకొనే నాధుడే లేనపుడు ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదని సెటైర్ లు వేస్తున్నారు. మరి ఇవన్నీ కోదండం గారికి ఎవరు చెప్తారో చూడాలి.