చంద్రబాబుని లైట్ తీసుకున్న తిరుపతి తమ్ముళ్లు.. ఇక కష్టమేనా!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. సిట్టింగ్ స్థానంగా ఉన్న తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. రెండవసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగిన సుగుణమ్మకు ఈ దఫా పరాజయం తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ అకాల మరణంతో జరిగిన తిరుపతి ఉప పోరులో ఆయన సతీమణి సుగుణమ్మ అనూహ్య విజయం సాధించారు. లక్ష ఓట్లకు పైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. నాటి పోటీకి వైసీపీ దూరంగా ఉండటంతో సుగుణమ్మ ఈ ఘనత సాధించారు. అయితే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పలేదు. సుగుణమ్మపై వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కుప్పం తప్ప మిగిలిన 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 12 చోట్ల వైసిపి అభ్యర్ధులు 25 వేలకు పైగా మెజారిటీ సాధించగా తిరుపతి విషయానికి వస్తే కేవలం 800 ఓట్ల ఆధిక్యంతో భూమన గెలిచారు. భూమనకు సుగుణమ్మ గట్టి పోటీనిచ్చారని వైసిపి గాలిలో ఆమెకు గౌరవప్రదమైన ఓటమి దక్కిందని అంతా అనుకున్నారు. టిడిపి క్యాడర్ అంతా కలిసి సుగుణమ్మ కోసం బలంగా పోరాడారని భావించారు.

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా సీన్ మారిపోయింది. తిరుపతి టిడిపిలో గ్రూపుల గోల ముదురుతోంది. ఎవరికి వారు బడా లీడర్ లుగా భావించుకుంటూ ముందుకు వెళ్తూ.. ఉండడంతో సమస్య మొదలైంది. గత ఎన్నికల్లో తిరుపతి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ టిడిపి నేత మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఇప్పుడు మారిపోయారు. ఎన్నికలకు ముందు సుగుణమ్మ విజయం కోసం బాగానే కష్టపడ్డ ఆయన ఇప్పుడు పార్టీకీ అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. సుగుణమ్మ ఆధ్వర్యంలో  ఈమధ్య జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలకు ఆయన మొక్కు బడిగా వచ్చి వెళ్లారే తప్ప అంతగా ఆసక్తి కనబరచలేదనే టాక్ నడుస్తోంది. చాలా మంది స్థానిక టిడిపి నాయకులది ఇదే పరిస్థితి. సుగుణమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలకు నిరసనలకు స్థానిక క్యాడర్ అంతంత మాత్రంగానే సహకరిస్తోంది. మొత్తం బాధ్యతంతా సుగుణమ్మపైనే పడుతోందని ఆమె అనుచరులు అంటున్నారు.

అంతేకాకుండా ఈ మధ్య తిరుపతి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నగర వీధుల్లో అమరావతి కోసం భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇక్కడే తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న వ్యవహారం మరింత బట్టబయలైందని చెప్తున్నారు. స్వయంగా అధినేత తిరుపతికి వస్తున్నా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఎవ్వరు అంత సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. జన సమీకరణపై ఎవ్వరూ దృష్టి సారించకపోవడంతో చంద్రబాబు భిక్షాటన కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగిందని అంటున్నారు. వాహనాల హడావుడి తప్ప ఈ ర్యాలీలో పెద్దగా జనాలు కనిపించలేదు. పోలీసులు ఆంక్షలు కూడా ఈ పరిస్థితికి కారణం. అయినప్పటికీ.. తెలుగు తమ్ముళ్లు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం వల్లే మొక్కుబడిగా ఈ వ్యవహారం ముగిసింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు పర్యటన ముగిసిన రెండు రోజులకే వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా నగర వీధుల గుండా భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొని సూపర్ సక్సెస్ చేశారు. చూశావా చంద్రబాబు ఇది నా సత్తా అంటూ ఇదే ర్యాలీ నుంచి బాబుపై విరుచుకుపడ్డారు భూమన. ఈ మొత్తం వ్యవహారం టిడిపి అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనకు పార్టీ క్యాడర్ పూర్తిస్థాయిలో పనిచెయ్యలేదని అధిష్ఠానం భావిస్తోందని చెబుతున్నారు. స్థానిక నేతల మధ్య గ్రూపుల గొడవే ఇందుకు కారణంగా అధిష్ఠానం భావిస్తోంది.