తిరుమలలో కొడాలి నాని దాష్టీకం..టీటీడీ విజిలెన్స్ ను తోసేసి మరీ మహాద్వార ప్రవేశం!

మేమే దేవుళ్ళం.. అసలు సృష్టిని నడిపిస్తున్నది మేమే అనుకుంటున్నారో ఏమో కానీ ఏపీలో వైసీపీ నేతల తలబిరుసు వ్యవహారం సంచలనం అవుతోంది. 151 సీట్లు వచ్చాయి కదా  మేం చెప్పిందే వేదం.. మేం రాసుకుందే రాజ్యాంగం అన్నట్లుగా పాలిస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ సర్కార్ లో ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో తలెత్తిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. భక్తులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రం ఎంతటి పవర్ ఫుల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని నిబంధనలు  ఉంటాయి.. ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ హిందూ సంప్రదాయంతో పాటు తరతరాలుగా ఏడుకొండల  ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు సంబంధించినవి అయి ఉంటాయి. వీటిని ప్రభుత్వాలు ముందుగా గౌరవించి ఔదాల్చాలి. కానీ, ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను తుంగలో తొక్కి ఏడుకొండల వేంకటేశ్వరస్వామి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు.

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీ మరోసారి తన అహంకార ధోరణిని తిరుమల సాక్షిగా బయటపెట్టారు. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి ప్రవేశించారు. అధికారులు అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారిని తోసుకుంటూ కొడాలి నాని ఆలయంలోకి వెళ్లారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్రహోత్సవాల లాంటి సమయాల్లో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించే సీఎంకు తోడుగా కొందరు మంత్రులు కూడా ఆలయ మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్తారు. సోమవారం (సెప్టెంబర్ 18) కూడా సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తుండగా అలాగే సీఎంతో పాటు మరికొందరు మహాద్వారం నుండి లోపలికి వెళ్లారు.

టీటీడీ నిబంధనల ప్రకారం చూస్తే ఈ మహాద్వారం నుండి రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక స్థాయి ఉన్న ప్రభుత్వాధినేతలు, పాలకులకు మాత్రమే వెళ్లే వీలుంది. కానీ, ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి అలా వెళ్లే అవకాశం లేదు. అయితే ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆయనకంటే ముందుగా కొడాలి నాని ఆలయ మహా ద్వారం నుంచి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు చేతులతో నమస్కరిస్తూనే నానీ లోపలకు వెళ్లే వీల్లేదని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సీరియస్ అయిన కొడాలి నాని నన్నేఆపుతారా? అంటూ వాగ్వాదానికి దిగారు. తన రెండు చేతులతో విజిలెన్స్ అధికారిని తోసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీటీడీ సీవీ అండ్ ఎస్వో నరసింహ కిశోర్ కొడాలిని లోపలకు పంపారు. దీంతో సీఎం జగన్ కంటే ముందే కొడాలి నాని ఆలయంలోకి ప్రవేశించారు. విజిలెన్స్ సిబ్బంది ఆపినా ఆగని కొడాలి నానిపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమల దైవం, టీటీడీ అంటే కనీసం గౌరవం లేని ఎమ్మెల్యే కొడాలి అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇదే కొడాలి నానీ గతంలో కూడా టీటీడీ నిబంధనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్యమతాల వారు తిరుమల దర్శనానికి వెళ్ళినపుడు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర మతస్థులమైనా తమకి వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని.. అందుకే దర్శనానికి వెళ్తున్నామని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ ,రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే దర్శనానికి వెళ్లారు.

కానీ, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి వెళ్లారు. దీనిపై అప్పుడు విమర్శలు తలెత్తగా కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని అప్పట్లో ఆయన ప్రశ్నించారు. ఏ గుడికీ, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇలా మరోసారి కొడాలి నానీ టీటీడీ రూల్స్ అతిక్రమించారు.