బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకుంటున్నాడా?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులూ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏ పార్టీల వైపు చూస్తారో అనేది చెప్పలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జి. కిషన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.జి. కిషన్‌రెడ్డి ఇప్పటి వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2004లో అయన హిమాయత్ నగర్ నుండి, 2009 మరియు 2014లలో అంబర్‌పేట నియోజక వర్గం నుండి పోటీ చేసి ఎమ్యెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది.దీంతో రానున్న ఎన్నికల్లో ఎంపీ గా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. అది కూడా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారని తెలుస్తోంది.కిషన్‌రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే,అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి కావ్య కిషన్‌రెడ్డిని పోటీ చేయించాలనే యోచనలో ఆయన సన్నిహితులు ఉన్నట్లు సమాచారం.

 

 

దీనిలో భాగంగానే ఆయన సతీమణి కావ్య కిషన్‌రెడ్డి వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారని ప్రచారం సాగుతోంది.2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కిషన్‌రెడ్డి విజయం సాధించడంలో కావ్యకిషన్‌రెడ్డి ప్రముఖ పాత్ర వహించారు.భర్తతోపాటు కావ్య కిషన్‌రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయితే ఈ విషయమై మాట్లాడిన కిషన్ రెడ్డి మాత్రం, ఆయన సతీమణి రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని అన్నారని,ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అని జరుగుతున్న ప్రచారంపై మౌనంగా ఉన్నట్లు సమాచారం.కిషన్ రెడ్డి మనసులో ఏముందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.