ఈటలను కలిస్తే తప్పేంటి! రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్
posted on May 25, 2021 7:10PM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజేందర్ తో బీజేపీ నేతలు సమావేశమయ్యారని, ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ నేత ఒకరు హైదరాబాద్ వచ్చిన ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారని అంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా రాజేందర్ కలిసి చర్చించారనే ప్రచారం సాగుతోంది.
రాజేందర్ తనను కలిశారని జరుగుతున్న ప్రచారంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను ఈటలను కలవలేదు.. ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు. అసెంబ్లీలో ఈటలతో కలసి 15ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్ తో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఈటలను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదని చెప్పారు. అందర్నీ కలుస్తున్నాను.. తనను కూడా కలుస్తానని ఈటల తనతో అన్నారన్నారు. హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనే విషయాన్ని అధిష్ఠానంతో చర్చించలేదన్నారు.
తనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. బీజేపీలో గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు. కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారని జరుగుతున్న ప్రచారం నిజమేనని భావిస్తున్నారు.