కిరణ్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు... మాజీ సీఎంపై సోనియా ఆశలు...

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా... కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా పట్టు నిలుపుకోలేకపోయిన మాజీ సీఎం కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి... మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలను కిరణ్ కుమార్‌ రెడ్డికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్‌గా కిరణ్‌ పేరును దాదాపు ఖరారు చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ... కిరణ్ కుమార్ రెడ్డి వైపే... సోనియా మొగ్గుచూపారని అంటున్నారు. రెండు రోజుల్లో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినా... ఘోర పరాజయాన్ని చవిచూడటంతో అసలు ప్రజల్లోకి రావడమే మానేసిన ఈ మాజీ ముఖ్యమంత్రి... ఈ ఐదేళ్లలో కేవలం ఐదారుసార్లు మాత్రమే మీడియాకి కనిపించారు. 2014 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుంచి తన తమ్ముడిని బరిలోకి దింపిన కిరణ్ కుమార్ రెడ్డి డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. అప్పట్నుంచి పొలిటికల్‌ గా లోప్రొఫైల్‌ మెయింటైన్ చేస్తోన్న కిరణ్‌రెడ్డి‌... ఏడాది క్రితమే మళ్లీ కాంగ్రెస్ లో చేరి... మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో చేరడమైతే చేరారు కానీ... పొలిటికల్ గా మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి.

అయితే, రఘువీరారెడ్డి స్వచ్ఛందంగా ఏపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, కొత్త సారధి కోసం కొన్నేళ్లుగా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్  ఉమన్ చాందీ కూడా ఏపీసీసీ సారధి కోసం అందరి నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. పీసీసీ పగ్గాల కోసం పల్లంరాజు, చింతామోహన్, శైలజానాథ్ తదితర నేతలు పోటీ పడినా... ఏపీ కాంగ్రెస్ లీడర్లలో ఎక్కువ మంది కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడంతో... అతనివైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నియామకంపై ఒకట్రెండు రోజుల్లోనే ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐసీసీ అండ్ సీడబ్ల్యూసీ స్థాయి పదవిని ఆశించిన కిరణ్ రెడ్డి... మరి, ఏపీసీసీ పగ్గాలు చేపడతారో లేదో చూడాలి.