ఓటమి దిశగా ఆప్ అధినేత కేజ్రీవాల్
posted on Feb 8, 2025 9:05AM
.webp)
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎదురీదుతోంది. ముచ్చటగా మూడో సారి ఢిల్లీ పీఠంపై జెండా పాతాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడగం లేదు. ఆ పార్టీ కీలక నేతలంతా ఓటమి బాటలో ఉన్నారు. శనివారం (ఫిబ్రవరి 8) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ ఫలితాల సరళి బీజేపీకి దాదాపు ఏకపక్ష విజయం లభించేలా సాగుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలంతా తమతమ నియోజకవర్గాలలో వెనుకంజలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అతిశి తమ తమ సమీప ప్రత్యర్థుల కంటే బాగా వెనుకబడ్డారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కంటే వెనుకబడ్డారు. అలాగే కల్కాజీ నియోజకవర్గం బరిలో నిలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత ఆతిశీ మార్లేనా ఒటమి దిశగా సాగుతున్నారు. జంగ్ పుర నుంచి పోటీ చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ కంటే వెనుకబడి ఓటమి దిశగా సాగుతున్నారు.
ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు బీజేపీ 50 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా లీడ్ లో లేదు. పోలింగ్ తరువాత వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ సారి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నాయి. ఫలితాల సరళి చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.