కేజ్రీవాల్ రాజీనామా.. ముందస్తు తథ్యం!?
posted on Sep 16, 2024 9:36AM

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రజలు మళ్లీ తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చేవరకూ తాను సీఎం చెయిర్ లో కూర్చునేది లేదని తేల్చేశారు. ప్రజా తీర్పునకు కట్టుబడి ఉంటానని, ఒక వేళ వారు తనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినా దానికి కట్టుబడి ఉంటాననీ, ప్రజా తీర్పును శిరసావహిస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిలుపై విడుదల అయిన తరువాత ఆయన ఢిల్లీలో ని పార్టీ కేంద్ర కార్యా లయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలోనే రాజీనామా ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోప ణలను ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్. ఆరు నెలల పాటు తీహార్ జైలులో గడిపారు.
బెయిల్ లభించిన రోజు రాత్రే తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రి ఆతిషీ, ఎంపీ సంజయ్ సింగ్, ఇతర నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు.
అనంతరం కేజ్రీవాల్ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని అన్నారు.
బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా ఆధారరహితఆరోపణలేనన్న విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాననీ, అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నననీ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు భావిస్తే ఓటు వేస్తారని, అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. మొత్తం మీద తన నిర్ణయంతో కేజ్రీవాల్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ప్రజలు ఓటేస్తే తనను వారు నిర్దోషిగా ప్రకటించినట్లే. అప్పుడు పదవి చేపడతారు.ఇప్పుడు మాత్రం తన రాజీనామా ప్రకటన ద్వారా ప్రజల నుంచి సానుభూతి లభించడం మాత్రం ఖాయం.
తన రాజీనామా ప్రకటనతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రజా మద్దతుతో పదవీ బాధ్యతలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఓ మూడు నాలుగు నెలల పాటు సీఎం పదవికి దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయ కుట్రలో భాగంగానే తనను బీజేపీ మద్యం కుంభకోణం కేసులో ఇరికించిందన్న సందేశాన్ని ఆయన బలంగా ప్రజలకు ఇవ్వగలుగుతారు. ఢిల్లీ వంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన తనకున్న పరిమిత అధికారాలతోనే పాలనలో తనదైన ముద్ర వేశారు. ఆ విషయంలో హస్తిన ప్రజలకు ఆయనపై అభిమానం ఉంది. పైగా అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా రాజకీయాలలోకి వచ్చిన కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలను జనం పెద్దగా నమ్మిన దాఖలాలు లేవు. ఆయన బెయిలుపై విడుదల కాగానే చేసిన రాజీనామా ప్రకటన, అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టనని చెప్పడం ద్వారా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.