గులాబి పార్టీలో గుబుల్ గుబుల్.. కేసీఆర్ వ్యాఖ్యలే కొంప ముంచాయా?

తెలంగాణలో ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలన్న కేసీఆర్ ఆకాంక్ష నెరవేరే పరిస్థితులు లేవా? స్వయంగా కేసీఆర్ తన వ్యాఖ్యల ద్వారా పార్టీ క్యాడర్ కు ఇదే సందేశాన్ని పంపారా? కేసీఆర్ వ్యాఖ్యలే బీఆర్ఎస్ శ్రేణులలో గుబులు రేపుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులలో నిస్తేజాన్ని, నిరుత్సాహాన్నీ నింపిందని అంటున్నారు. 

సాధారణంగా కేసీఆర్ అంటే  ప్రత్యర్థి  పార్టీల  పాలిట సింహస్వప్నం. ఆయన ఎత్తులు, వ్యూహాలూ ప్రత్యర్థి పార్టీల అంచనాలకు కూడా అందనంత ఎత్తులో ఉంటాయన్నది ఇంత కాలం అంతా చెబుతున్న మాట. అయితే వరుసగా  రెండు సార్లు తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ హ్యాట్రిక్ దిశగా  సాగుతున్నారా అన్న అనుమానాలు ఆయన వ్యాఖ్యల వల్లనే కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 
సాధారణంగానే కేసీఆర్ మాటలకు, విమర్శలకు పదునెక్కువ. కింద పడ్డా  పై చేయి నాదేనన్న ధీమాతో ఉంటారు. దళితుడే తెలంగాణ తొలి  ముఖ్యమంత్రి అని  ఉద్యమ సమయంలో  ఉద్ఘాటించిన కేసీఆర్, ఆ తరువాత కొత్త రాష్ట్రానికి అనుభవజ్ణుడైన ముఖ్యమంత్రి కావాలంటూ తానే ఆ  పదవి  చేపట్టారు. అదే విధంగా  ప్రతి  దళిత కుటుంబానికీ  మూడెకరాల  భూమి అంటూ చేసిన వాగ్దానాన్ని  కూడా భూమి ఎక్కడుందంటూ విస్మరించారు.

అయినా తెలంగాణ సమాజం ఆయనను కాదనుకోలేదు. రాష్ట్రం కోసం సుదీర్ఘ ఉద్యమానికి నాయకత్వం  వహించిన నాయకుడిగా  ఆయనను  ప్రజలు  గౌరవించారు. అయితే తొమ్మిదేళ్ల పాలనలో  ఆయన సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత కూడా అదే స్థాయిలో  పెరిగింది. అన్నిటికీ మించి బీజేపీతో  రహస్య  మైత్రి అన్న అనుమానాలూ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత  కోసం ఆయన  కేంద్రంతో  రాజీపడ్డారన్న విమర్శలు  బీఆర్ఎస్ పట్ల  ప్రజలలో  ఒకింత  వ్యతిరేకతకు కారణమయ్యాయి. అది గుర్తించారో ఏమో  కేసీఆర్ ఇటీవల పాలమూరు సభలో బీఆర్ఎస్  ను గెలిపించుకోవలసిన బాధ్యత ప్రజలదేనని పిలుపు నిచ్చారు. అక్కడితో ఆగకుండా ఓడిపోతే నాకేం నష్టం  లేదు.. హాయిగా ఇంట్లో  విశ్రాంతి తీసుకుంటా.. కష్టపడాల్సింది  మీరే నంటూ జనాన్ని హెచ్చరించారు. అయితే.. ఓడిపోతే రెస్టు తీసుకుంటా అన్న  మాటే  బీఆర్ఎస్ శ్రేణులకు తప్పుడు సంకేతాలను పంపిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు ముందే కేసీఆర్ కాడె వదిలేశారా? అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. ఇక విపక్షాలైతే కేసీఆర్ ఇప్పుడు మాత్రం విశ్రాంతి  తీసుకోవడం కాక మరేం చేస్తున్నారని ఎద్దేవా చేసేలా చేశాయి.  

నిన్న మొన్నటి వరకూ సర్వేలు ఘోషిస్తున్నాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం.. వంద స్థానాలలో విజయం ఖాయం. కాంగ్రెస్‌కు అభ్యర్దులే లేరు. అంటూ చెప్పిన  కేసీఆర్ తాజాగా ఓడిపోతే రెస్టు తీసుకుంటాం అనడం ఆయనలోని ఓటమి భయాన్నే సూచిస్తోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అందుకు తగ్గట్టుగానే.. బీఆర్ఎస్ లో చేరికల సంగతి అటుంచి వలసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి కూడా అసంతృప్తులు అధికార పార్టీ కేసి కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీయే మాకు ప్రత్యర్థి అంటూ ఆ పార్టీపై విమర్శలు కురిపించిన కేసీఆర్ నోట ఇప్పుడు కాంగ్రెస్ మాట తప్ప మరొకటి రావడం లేదు.  ఈ పరిస్థితులే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అన్న కాంగ్రెస్ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. మొత్తంగా రెస్టు తీసుకుంటానన్న కేసీఆర్ మాట.. బీఆర్ఎస్ లో ఓటమి భయాన్ని రేకెత్తించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News