చలో బీహార్.. నితీష్, తేజస్వి ప్రసాద్ తో భేటీకి పట్నాకు కేసీఆర్

బీహార్ పరిణామాలతో కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆయన బీహార్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 14(శనివారం), 15(ఆదివారం) తేదీలలో ఆయన బీహార్ లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో ఆయన బీహార్ సీఎం నితీష్ కుమర్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో భేటీ అవుతారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డయే కూటమి నుంచి బయటకు వచ్చేయడంతో మరో సారి జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలను వేగవంతం చేయాలని కేసీఆర్ భావస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదవ సారి ప్రయాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించడమే తన పర్యటన ఉద్దేశమని కేసీఆర్ చెబుతున్నప్పటికీ పరిశీలకులు మాత్రం జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలపై చర్చించేందుకు కేసఆర్ బీహార్ పర్యటన అని అంటున్నారు.

ఇంత కాలం ఎన్డీయే కూటమిలో ఉన్నందున నితీష్ కుమార్ తో కేసీఆర్ టచ్ లో లేరు కానీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం చాలా కాలం నుంచీ కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మోడీపై విమర్శలు గుప్పించడం, 2024లో బీజేపీ ఓటమి తథ్యమంటూ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అందుకే బీజేపీతో కటీఫ్ చెప్పి నితీష్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడంతోనే ఆయనతో భేటీకి కేసీఆర్ బీహార్ పయనమౌతున్నారని పరిశీలకులు అంటున్నారు.