గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ డుమ్మా.. ముఖం చాటేశారా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలకు తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ సమావేశాలకు ఆయన హాజరవుతారంటూ కారు పార్టీలో ఓ ప్రచారం అయితే గట్టిగానే షికారు చేసింది. అయితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ఎలా ముఖం చాటేశారో.. సరిగ్గా అలాగే అసెంబ్లీ సమావేశాల ప్రాంరభం రోజున గవర్నర్ ప్రసంగానికి ఆయన గైర్హాజరయ్యారు. కేసీఆర్ సమావేశాలకు రాకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

తెలంగాణ గవర్నర్ తమిళసై ను ఫేస్ చేయడం ఇష్టం లేకే ఆయన   హాజరుకాలేదనే ఓ చర్చ సైతం సాగుతోంది. అదీ కాక తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో.. ఆయనకు గవర్నర్ తమిళి సై మధ్య సత్సంబంధాలు లేవనీ, వ్యవహారం ఉప్పూ నిప్పూలా ఉండేదనీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ  ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్... తన రాజీనామా లేఖను  స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి  గవర్నర్‌కు అందజేయకుండా.. తన ఓఎస్డీ ద్వారా పంపారని,  దీంతో కేసీఆర్ వ్యవహార శైలిపై నాడే పలువురు ప్రజాస్వామిక వాదులు  మండిపడ్డారని పార్టీ  శ్రేణులు ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నాయి. 
 అదీకాక ఇవి బడ్జెట్ సమావేశాలు.. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అలాంటి వేళ సభకు గవర్నర్ వస్తే.. సభా మర్యాదలు పాటించాల్సి ఉందని.. దీంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఈ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు.. డుమ్మా కొట్టారనే ఓ చర్చ  పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది. 

మరోవైపు కేసీఆర్‌కి సెంటిమెంటే ఆయుధమని.. దీనిని ఆయన బాగా నమ్ముతారని, అందుకే    అమావాస్య కనుక ఆయన అసెంబ్లీ సమావేశాల తొలి రోజు బయటకు రాలేదని అంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కేసీఆర్ ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారని,  ప్రస్తుతం అదే సెంటిమెంట్‌ను ఆయన కొనసాగిస్తున్నారనే మరో చర్చ సైతం నడుస్తోంది. 

అదీ కాక ఇటీవలే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారని.. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని అంతా భావించారని... మరి ఆయన ఈ సమావేశాలకు హాజరై.. అధికార పక్షంలోని లోపాలను ఎత్తి చూపుతారా? లేకుంటే.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే.. .అదే సెక్రటేరియట్ అన్నట్లుగా ప్రతిపక్ష నేత ఎక్కడుంటే అదేనంటూ.. మరో కొత్త భాష్యంకి తెర తీస్తారా? అని గులాబీ పార్టీ శ్రేణుల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా హల్ చల్ చేస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu