ది బిగ్ ఫైట్ ఎప్పుడంటే?

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 29న ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. మే 10 న మొత్తం 224 నియోజక వర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలోకి వచ్చింది.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు ఆ మధ్యలో జరిగే ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిగ్నేచర్ ట్యూన్ గా  మేలు కొలుపు గీతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని   పేర్కొంటున్నారు. 

అందుకే లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల క్రమంలో తొలి ఎన్నిక జరిగే కర్ణాటకలో బోణీ కొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి.  లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్నికలు జగరనున్న రాష్ట్రాలలో తెలంగాణ, సిక్కిం, మిజోరాం మినహా మిగిలిన రాష్టాలలో ప్రధాన పోటీ  కేంద్రంలో అధికారం కోసం తలపడుతున్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే ఉంటుంది.  ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్టాలలో అయితే  ఆప్, తృణమూల్ వంటి పార్టీలు పోటీ చేసినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ముఖాముఖీ పోరు ఉంటుందని అంటున్నారు.

ఈ నాలుగు రాష్ట్రలో  కలిపి మొత్తం 92 (కర్ణాటక 28, ఛత్తీస్ ఘడ్ 11, మధ్య ప్రదేశ్ 29, రాజస్థాన్ 25) లోక్ సభ స్థానాలున్నాయి. ఈ నాలుగు రాష్ట్రలలో గత (2019) లోక్ సభ ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఒక విధంగా క్లీన్ స్వీప్ చేసింది.  మొత్తం 92 స్థానలకు  గానూ, బీజేపీ 86 స్థానాలు గెలిచుకుంది. కాంగ్రెస్ కేవలం నాలుగు (4) స్థానాలకు పరిమితం అయింది  కర్ణాటక బీజేపే 25, కాంగ్రెస్ 1,  ఛత్తీస్ ఘడ్ బీజేపే 9, కాంగ్రెస్ 2, మధ్య ప్రదేశ్ బీజేపీ 28, కాంగ్రెస్ 1, రాజస్థాన్ బీజేపీ 24, కాంగ్రెస్  సున్నా. ఆ విధంగానూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్తుతో పాటుగా  దేశ రాజకీయ భవిష్యత్ ను నిర్ధారించే టర్నింగ్ పాయింట్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

అదలా ఉంటే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేతలు ఇద్దరికి పరీక్షగా నిలుస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు స్వరాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోవడం  సవాలుగా మారితే, భారత జోడో యాత్ర, అనర్హత వేటు నేపథ్యంలో ప్రధాని మోదీతో  ఢీ అంటే ఢీ  అంటున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,  రాహుల్ గాంధీ నాయకత్వానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అతి పెద్ద పరీక్షగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఏప్రిల్‌ 9న ఒకే రోజు  అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు రాహుల్‌ గాంధీ కర్నాటకలో  వేర్వేరు సభల్లో పాల్గొనడం ఆసక్తి రేకిస్తోంది.

 2019లో కోలార్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల గుజరాత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు పడటం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల సమయంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ రావడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో త్వరలో ప్రచారం చేపట్టనున్నారు. అయితే గతంలో ఎక్కడ అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో.. అదే కోలార్‌ నుంచి ఈసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఇటీవల పార్టీ వెల్లడించింది. ‘సత్యమేవ జయతే’ పేరుతో కోలార్‌లో ఈ ర్యాలీని ఏప్రిల్‌ 5న జరపాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వాయిదా వేసి ఏప్రిల్‌ 9న నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. అదే రోజున, మైసూరులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.‘ప్రాజెక్ట్‌ టైగర్‌’స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అదే రోజు సత్యమేవ జయతే ర్యాలీ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే, ప్రధాని పర్యటన అధికారిక పర్యటన కాగా, రాహుల్ గాంధీ ఉద్దేశ పూర్వకంగానే, మోడీతో కర్ణాటక గడ్డ మీద ఢీ  అనేందుకే ఏప్రిల్ 9 ముహూర్తం నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఏమైనా, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అగ్ని పరీక్ష అనడంలో సందేహం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu