తుని "తుట్టె"ను కదుపుతున్న ప్రభుత్వం..

కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉద్యమం పేరిట విధ్వంసానికి పాల్పడిన వారి తాట తీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధ్వంసంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆరుగురు నిందితులను ఏపీ సీఐడీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. వీరిలో  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దూడల మణీంద్ర అలియాస్ ఫణి, లగుడు శ్రీనివాసరావు, పెండ్యాల రామకృష్ణ, నక్కసాయి. గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీశెట్టి శివగోపి మహేశ్, ముదిగొండ పవన్ కుమార్ ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనవరి 31, 2016 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జనకు పిలుపునిచ్చారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా కాపులను బీసీలలో కలపాలని, రూ.1000 కోట్ల నిధితో కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముద్రగడ ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాపులు తునికి చేరుకున్నారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై వేలాది వాహనాలు బారులు తీరాయి. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభమైంది. సభ ముగిసిన తర్వాత ముద్రగడ ఒక్కసారిగా రాస్తారోకో, రైల్‌రోకోకు పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం జీవోలు ఇచ్చే వరకు రోడ్లపైనే బైఠాయించాలని ముద్రగడ చెప్పడంతో యువకులు ఒక్కసారిగా ఐదో నెంబర్ జాతీయ రహదారిపై చేరారు. అనంతరం తుని రైల్వే స్టేషన్‌కు చేరుకుని అప్పుడే వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించారు.

 

ఆందోళనకారుల్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయపడి పరుగులు పెట్టారు. అందరూ దిగిపోయాక..బోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో 23 బోగీలు తగులబడిపోయాయి. అంతటితో ఆగకుండా పట్ణణంలోకి ప్రవేశించి తుని పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి సామాగ్రిని, వాహనాల్ని తగులబెట్టారు. పోలీసులపై దాడులకు దిగడంతో కొంతమందికి గాయాలయ్యాయి. పట్టణంలో దుకాణాలు మూసేయాలని హెచ్చరిస్తూ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ బీభత్సానికి తుని వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలా గడిపారు. మరుసటి రోజు వరకు అడుగు బయట పెట్టాలంటేనే వణికపోయారంటే అల్లరిమూకలు సాగించిన విధ్వంసాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ విధ్వంసంలో రైల్వే, పోలీసు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి వంద కోట్లకు పైగా నష్టం జరిగింది. జరిగిన నష్టానికి సంబంధించి ముద్రగడతో పాటు పలువురిపై 73 కేసులు నమోదయ్యాయి.

 

వీటన్నింటిని సీఐడీకి బదిలి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రంగంలోకి దిగిన సీఐడీ ఆ రోజు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన, పలు కెమెరాల్లో బంధించిన, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన, ప్రజల నుంచి సేకరించిన చిత్రాలు, దృశ్యాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. తుని పరిసర ప్రాంతాల్లోని 50 సెల్‌టవర్ల నుంచి విధ్వంసం జరిగిన ప్రాంతానికి వెళ్లిన సంకేతాలను కూడా విశ్లేషించారు. ఘటనా స్థలంలో సెల్‌ఫోన్లను దొంగిలించి వాటి సాయంతో కమ్యూనికేషన్ నడిపినట్టు గుర్తించారు. ఆందోళనకారులతో పాటు సంఘ వ్యతిరేకశక్తులు జతకలవడంతో విధ్వంసం మరింత ఎక్కువైనట్టు సీఐడీ తేల్చింది. ఇలా దాదాపు 400 మంది పేర్లు, చిరునామాల జాబితాలు సిద్ధం చేసి తొలివిడతగా వారిలో ఆరుగురిని అరెస్టు చేశారు. మిగతా నిందితులను కూడా దశలవారీగా అరెస్ట్‌లు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ వార్తతో ఆ ఘటనలో పాల్గొన్న వారి వెన్నులో వణుకు మొదలైంది. కేసులతో భయాందోళనలకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పలువురు కాపు నేతలు ఆరోపిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలి తప్ప విధ్వంసానికి దిగితే సమస్య తీరకపోగా మరింత జఠిలమవుతుంది. ఈ విషయాన్ని ఉద్యమాన్ని నడిపేవారు గ్రహిస్తే మంచిది.