టిటిడీ చైర్మన్ పదవికి కనుమూరి రాజీనామా?

 

 గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో టీటీడీ చైర్మన్ గా నియుక్తులయిన కనుమూరి బాపిరాజు ఈ రోజు తన పదవికి రాజినామా చేయబోతున్నారు. నాలుగు రోజుల క్రితం సమావేశమయిన రాష్ట్రమంత్రి వర్గం రాష్ట్రంలో అన్ని ఆలయ పాలక మండళ్ళను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ రోజు దాని కోసం ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేయబోతోంది. ఆర్డినెన్స్ జారీ అయితే ఆయన పదవి నుండి తొలగింపబడినట్లవుతుంది, కనుక అంతకు ముందే స్వచ్చందంగా రాజీనామా చేసి తప్పుకోవడమే గౌరవప్రధమని భావిస్తున్నందున, ఆయన ఈ రోజు రాజీనామా చేసేందుకు సిద్దం అవుతున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల కొండ మీదే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడబోతున్నారు. మరి కొద్ది రోజులలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. అందువల్ల అంతవరకు తనను పదవిలో కొనసాగించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. అంతేకాక ఒక కేంద్రమంత్రి ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదని స్పష్టమయింది. అందువల్ల ఆయన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా ఆశ్చర్యం లేదు. ఆయన స్థానంలో మాజీ తెదేపా యం.యల్యే చదలవాడ కృష్ణ మూర్తి టీటీడీ చైర్మన్ గా నియుక్తులయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.