బీజేపీ విషయంలో బాబుపై మండిపడ్డ కన్నా...

తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్రంగా ఎదగాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని టీడీపీకి డోర్లు మూసివేశామని అమిత్ షా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించేందుకు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ కర్నూల్ వచ్చారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి విషయానికొస్తే ,తమకు రాష్ట్ర అభివృద్ది చేస్తారన్న ఆశ అయితే కలగట్లేదని , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో ముందుకెళ్తాయన్న భావన కనిపించటం లేదుని కన్నా తెలియజేశారు.అభివృద్ధి అనేది కలలాగే మిగిలిపోయేటువంటి పరిస్థితి కనపడుతుందని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవకాశవాది అని, ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు.

టీడీపీ నేత చంద్రబాబు తొంభై తొమ్మిదిలో వాజపేయి గారి ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కాళ్లు గడ్డాలు పట్టుకుని భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకుని,ఆ పార్టీని సమాధి చేసారని కన్నా తెలియజేశారు.అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మోదీగారి ప్రతిభని దృష్టిలో పెట్టుకొని, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని శాశ్వతంగా పార్టీని దూరం చేయాలని చూశారని, ఆ పార్టీ బలపడకూడదు అనేటువంటిది తన ప్రధాన లక్ష్యంగా బాబు పెట్టుకున్నారని కన్నా వెల్లడించారు.ఇవాళ మళ్లీ భారతీయ జనతా పార్టీ చిగురిస్తున్న సమయంలో మళ్లీ  కొత్త ఎత్తుగడ వేసి భారతీయ జనతా పార్టీని  ఎదగనీయకుండా చేయాలనే లక్షంతో బాబు వైఖరి ఉందని కన్నా పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ రెండు సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకుని తీవ్రంగా నష్టపోయిందన్నారు.అమిత్ షా  నరసరావుపేట విచ్చేసినప్పుడు  భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా చంద్రబాబు నాయుడికి తలుపులు మూసేసింది అని షా స్పష్టంగా తెలియజేశారని కన్నా వెల్లడించారు.ప్రతిసారి మోసపోవటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదని కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.