విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియామకం
posted on Jul 30, 2024 3:16PM
విద్యుత్ కమిషన్ చైర్మన్ నియమకానికి చట్టబద్దత లేని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేస్తున్న బిఆర్ఎస్ కు సుప్రీంలో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీం ఆదేశాలు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతించి నూతన చైర్మన్ నియామకం చేసింది. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకూర్‌ను ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు.విద్యుత్‌పై ఒప్పందాలపై విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. అయితే ఆయన ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై కేసీఆర్ కోర్టుకు వెళ్లారు. జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన స్థానంలో లోకూర్‌ను నియమించారు.