లంకల దీపక్ రెడ్డి.. లక్కెంత.. కిక్కెంత?
posted on Oct 16, 2025 2:16PM

ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న లంకల దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక నవీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే కలిగి ఉన్నారు. కానీ, ఆయనకీ ఈయనకీ ఉన్న తేడా ఒక్కటే.. అధికారపార్టీ.
దీపక్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ అదేమంత పని చేసేలా లేదు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించడం అయ్యే పని కాదు. కారణం అప్పట్లో ఉన్న సిట్యువేషన్ వేరు- ఇప్పుడున్న పరిస్థితి వేరు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. దీపక్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం ఒక ఆటంకమైతే.. రెండోది ఇక్కడ అత్యధికంగా మైనార్టీ ఓట్లుండటం. దీపక్ ఇక్కడి మైనార్టీలను ఆకర్షించడంలోనూ తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పిందల్లా చేసే గొర్రెలు కారంటూ పరుష పదజాలం వాడారు.
ఆమాటకొస్తే తాము బీసీలకు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వారమనీ. ఇంకా మాట్లాడితే తమ ప్రధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీపక్ రెడ్డి. కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినట్టు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాటకు ఒక అర్ధముండేది. అంతే కాకుండా ఎందరో మహిళలు పోటీ పడగా.. వారందరినీ తోసి రాజని.. తనకున్న కిషన్ రెడ్డి సపోర్ట్ మొత్తాన్ని వాడారు దీపక్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైనస్ గా మారి దీపక్ రెడ్డి విజయావకాశాలను గండి కొట్టేలా కనిపిస్తోంది.
ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా కన్నీటిపర్యంతమై ప్రచారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన లోకల్ బాయ్ నవీన్ ముందు.. దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంకను జయించడం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు. కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జనరల్ అయ్యిందిగానీ గతంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం కూడా కావడంతో.. ఇక్కడ దీపక్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అసలు యుద్ధం మొత్తం సునీత, నవీన్ మధ్య ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు.