ఏపీలో అరాచక పాలన.. చంద్రబాబు కన్నీటిపై జూనియర్ రియాక్షన్
posted on Nov 20, 2021 2:56PM

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్న జూనియర్.. అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనసును కలిచివేసిందని అన్నారు. సభలో సమస్యలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఆరాచక పాలనకు నిదర్శనమన్నారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అన్నారు జూనియర్ ఎన్టీఆర్. మన నవ నాడుల్లో, రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయాన్ని, భవిష్యత్ తరాలకు జాగ్రత్తగా అప్పగించాలన్నారు.
ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు, అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
‘‘అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచి వేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుంది. స్త్రీ జాతిని గౌరవించటం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవ జీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచి వేసి, కాల్చేసి ఇదే రాబోయే తరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు’’
‘‘ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా’’అని ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడారు.