జయలలిత గురించి జయలలిత ఏమందో తెలుసా?  


జయలలిత మాటల్లో ప్రేమ అంటే.... 
'' అన్‌కండిషనల్‌ లవ్‌ అనేదే నిజమైన ప్రేమ, ఎలాంటి షరతులు లేని ప్రేమ! అలాంటి ప్రేమ ఉందంటే నేను నమ్మను'' 

తన ఫేవరెట్ క్రికెట్ స్టార్, బాలీవుడ్ హీరో గురించి... 
''నారీ కాంట్రాక్టర్‌ అంటే నాకు ఇష్టం, అతన్ని చూడ్డం కోసమే మ్యాచ్‌లకి వెళ్లేదాన్ని. తర్వాత షమ్మీ కపూర్‌ మీద ఓ బలమైన ఆకర్షణ. జంగ్లీ సినిమాను ఎన్నిసార్లు చూశానో.. అన్ని పాటలు నోటికి వచ్చేవి అప్పట్లో'' 

వాళ్ల అమ్మ గురించి అమ్మ ఏం చెప్పింది? 
''అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతుందేమో అని, ఆమె చీర చెంగుని నా చేతికిచుట్టేసుకుని పడుకునే దాన్ని.. అమ్మ నన్ను వదిలి వెళ్లక తప్పని పరిస్థితుల్లో నా చేతికి చుట్టుకున్న తన చీరని విప్పి, వేరే చీరని కట్టుకుని, ఆ చీరను మా అత్తకు కట్టించి అలాగే నా పక్కన పడుకోమని చెప్పి వెళ్లేది.. పొద్దున లేచి చూస్తే మా అమ్మ చీరలో మా అత్త నా పక్కన పడుకుని కన్పించేది..'' 

పురుచ్చి తలైవీ మాటల్లో నాయకత్వం...  
'' ఈ సమాజమే నాయకుడి జన్మకు కారణమవుతుందని నమ్ముతున్నా. ప్రతి మనిషిలోనూ అన్యాయాన్ని ప్రశ్నించే ఓ స్వభావం ఉంటుంది. ప్రతిస్పందించే ఒక నిజాయతీ ఉంటుంది. వాటిని ఎవరన్నా తట్టిలేపితే నాయకుడవుతాడు''

పురుచ్చితలైవీ మెచ్చిన పులిహోర...
సినీ నటి సూర్యకాంతం షూటింగ్‌లకి ఏదో ఒక ఫుడ్‌ ఐటమ్‌ ఇంట్లో చేసుకొని వచ్చే వారు. అయితే ఆమె వండే పులిహోర అంటే జయకి చాలా ఇష్టం. ఒకరోజు షూటింగ్‌లో సూర్యకాంతం పులిహోర తీసుకొచ్చారు. పొద్దున షూటింగ్‌ మొదలైనప్పట్నుంచీ జయ కళ్లన్నీ ఆ పులిహోర మీదే. ఎప్పుడెప్పుడు బ్రేక్‌ ఇస్తారా.. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. బ్రేక్‌ రానే వచ్చింది. వెంటనే పులిహోర బాక్స్‌ తెరిచి ఆవురావురుమని తింటుంటే ఎక్కిళ్లు వచ్చాయి. వెంటనే నీళ్లిచ్చి ప్రేమగా తడ్తున్న సూర్యకాంతం వైపు జయ ప్రేమగా చూసింది. ''ఆ సమయంలో ఆమెలో అమ్మ కనిపించింది'' అని అమ్మ చెప్పేది తరువాతి కాలంలో!

సూర్యకాంతమ్మ చనిపోయిన క్షణంలో... 
సూర్యకాంతం చూపించిన మాతృప్రేమని మర్చిపోకుండా, పదిలంగా గుండెల్లో దాచుకుని, ఆమె ఇక లేరు అన్న వార్త తెలియగానే.. ఉన్న పనులన్నీ పక్కనపెట్టి ఆమె భౌతికకాయం వద్ద మౌనంగా, బాధగా గడిపిన సీఎం జయలలితను ఏమని వర్ణించగలం? ఆమె మాటల్లోనే అయితే, '' నా మనసుని కదిలించిన సంఘటనలను, మనషులనూ నేనెప్పటికీ మర్చిపోను. నాలో ఒకరి పట్ల ఉన్న ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, కృతజ్ఞత కానీ పోతాయి అంటే అది నా తుదిశ్వాసతోనే!''

విమర్శకుడికి పరామర్శ... 
ఒకానొక సమయంలో జయని చో ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చోకి ఒంట్లో బాలేదంటే, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి ''యు విల్‌ కమ్‌ అవుటాఫ్‌ దిస్‌ వెరీసూన్‌'' అని అన్నారు. అదే నిజమైతే నాకు మరింత షాక్‌ అని చో బలహీనమైన స్వరంతో జోక్‌ వేశారు. జయ మాత్రం.. ''అలా అనకండి. మీకేం కాదు.'' అని ధైర్యం చెప్పారు. ఆ మాట ఏదో మాటవరసకి అన్నది కాదు. ఆమె మొహమాటం కోసం మనుషుల్ని చూడటం, మాట్లాడం చేయరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! 

జీవితపు ప్రతీ మలుపులో ప్రతి ఒక్కర్నీ అనుగ్రహించిన అమ్మ... 
ఒకరోజు జయలలిత తన నివాసమైన పోయస్‌ గార్డెన్‌లోకి రాగానే... సెక్యూరిటీని పిలిచి ''గార్డెన్‌కి రావటం కోసం తిరిగే మలుపులో ఓ కొట్టు ఉంటుంది. అక్కడ రోజూ ఓ ముసలాయన ఉంటాడు. రెండ్రోజుల్నించి చూస్తున్నా. కొట్టు మూసేసి ఉంది. అతనికి ఏమైందో కనుక్కోండి'' అని అదేశించారు. రెండు నిమిషాల్లోనే వార్తను మోసుకొచ్చారు సిబ్బంది. ముసలాయనకి జ్వరం, లేవలేకుండా ఉన్నాడు అని. వెంటనే ఆయన తరఫు వాళ్లని తీసుకురండని చెప్పడం... వాళ్లకి వైద్యం కోసం డబ్బు ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి.

శత్రువుల నిరాశ... ఆమె ఆనందం! 
''జైలులో అడుగుపెట్టిన ఆ రోజుని నేను మరిచిపపోలేను. జీపులో ఎక్కుతున్నప్పుడే మానసికంగా ఏం ఎదురైనా స్వీకరించాలని సిద్ధపడే ఎక్కాను. చాలాకాలం మూతపడి ఉన్న పాత బిల్డింగ్‌ని నా కోసం గౌరవనీయులైన కరుణానిధి ప్రత్యేకంగా తెరిపించారు. లోపల దుమ్ము, ధూళి, ఎలుకలు, పందికొక్కులు, తేళ్లు, జెర్రులు... ఒక చిన్న జువాలజీ క్లాస్‌ తీసుకోవచ్చు అక్కడ. కటిక నేలమీద పడుకున్నాను. నెల్రోజులు గడిపాను. ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. రాలేదంటే నేను రానివ్వలేదని కాదు అర్థం. నిజంగానే రాలేదు. ఇలా నేను మారడానికి ఒకటే కారణం. మనల్ని అవతలి వారు వ్యక్తిగతంగా గాయపరిచినప్పుడు మనం బాధ పడతాం. ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే... మన ముందు ఉన్న పరిస్థితిని మనం అంగీకరించకపోవడం వల్లే. నేను జైల్లో బాధపడితే చూడాలని అనుకున్నారు. సిబ్బందిని అడిగారట ఆమె ఏడుస్తోందా? అని. లేదు సార్‌ ఆమె ఏడవలేదు అని అంటే వాళ్లు నిరాశ చెందారని విన్నాను. నిజానికి వారి నిరాశ నన్ను ఆనందపరిచింది'' 

ఒక మామూలు అమ్మాయి... అమ్మగా అవతరించటమే... విధి!
''మన కోసం మనం బతకాలనుకున్నప్పుడు ఒకలా ఉంటాం. ఇతరుల కోసం మనం జీవించాలి అనుకున్నప్పుడు మనకే తెలియకుండా ఒక అనూహ్యమైన పరిణతిని పొందుతాం. మనం వూహించని విధంగా రూపాంతరం చెందుతాం. నేను ఇలా అవుతానని ముందే వూహించి ఉంటే బహుశా భయపడి వుండేదాన్నేమో. పార్టీలో చేరడమే మానుకునే దాన్నేమో. పార్టీలో చేరేనాటికి నేను మామూలు ఆడపిల్లని మరి. భయస్తురాల్ని కూడా. ఒక మామూలు అమ్మయి నుంచీ.. ఇలా మారటం నా డెస్టినీ''