జయలలిత అనే కోమలవల్లి గురించి... మీకీ సంగతులు తెలుసా?

 

మనం జయలలిత అంటోన్న పురుచ్చి తలైవీ అసలు పేరు కోమలవల్లి!


తమిళనాడు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె పుట్టింది మాత్రం కర్ణాటకలో!


జయలలితకు హైద్రాబాద్ లోని కొంపెల్లి ప్రాంతంలో ఫామ్ హౌజ్ వుందంటారు. అక్కడే ఆమె అప్పుడప్పుడూ సేద తీరేదట!


నటిగా, రాజకీయ నాయకురాలిగా జయ అందరికీ తెలుసు. కాని, ఆమె అద్భుతంగా భరతనాట్యం కూడా వచ్చు. అయిదో ఏట నుంచే నృత్యం నేర్చుకుంది!


సినిమాలంటే పెద్దగా ఇష్టం లేని జయలలిత తల్లి బలవంతం మీద 15ఏళ్ల వయస్సులో గ్లామర్ ప్రపంచంలోకి వచ్చింది. మొదటి సినిమాలో యంగ్ విడో క్యారెక్టర్ వేసింది. అయితే, అప్పటికి జయలలిత చదవుల్లో టాప్! మెట్రిక్ లో ఆమె స్టేట్ ర్యాంకర్! జయలలిత నిజమైన ఆశయం... లాయర్ అవ్వాలని!


అందాల హీరోయిన్ గా తమిళుల చేత కవర్చి కన్ని అని పొగిడించుకున్న ఆమె మొదటి సినిమాకే ఏ సర్టిఫికెట్ వచ్చింది! దాంతో అప్పటికి 15ఏళ్లే వున్న జయ ఆ అడల్ట్స్ ఓన్లీ రేటింగ్ వచ్చిన సినిమా చూడలేకపోయింది!


జయలలిత , శోభన్ బాబుల ప్రేమ గురించి అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి. వాళ్ల లవ్ నిజమో కాదోగాని... కొందరైతే జయకు శోభన్ బాబుతో ప్రియ మహాలక్ష్మీ అనే కూతురు కూడా వుందంటారు. కాని, ఈ గాసిప్స్ కి ఎలాంటి ఆధారం వున్నట్టు కనిపించదు...


ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం అంటే జయలలితకు చాలా ఇష్టం. అంతే కాదు, ఆమె రచయిత్రి కూడా! ఎస్టరియర్ అనే తమిళ వీక్లీలో థాయ్ పేరుతో ఆమె రచనలు ప్రచురించేది!


తమిళంలో ఆమె 85సినిమాలు చేసింది. అందులో 80సూపర్ హిట్! చాలా వరకూ సిల్వర్ జూబ్లీ సినిమాలు కూడా...


తెలుగులో 28సినిమాలు చేసిన జయ హిందీలో ఇజ్జత్ అనే సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ చేసింది!
జయలలితకు ఒక అన్న. ఆయన పేరు జయకుమార్. 1995లో మరణించాడు. 

తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేత, రెండో మహిళా సీఎం జయలలితే! అంతే కాదు, 43ఏళ్లకే మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె... ఇప్పటి వరకూ అత్యంత పిన్న వయస్కురాలైన తమిళ సీఎం! 


బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తండ్రి నవాబ్ అలీఖాన్ పటౌడీ అంటే జయలలితకు ఎక్కడలేని పిచ్చి. ఆయనను చూడటానికే క్రికెట్ మ్యాచ్ లకు వెళ్లేదట!


జయ తన పెంపుడు కొడుకు పెళ్లిలో లక్షన్నర మందికి ఆతిథ్యం ఇచ్చింది! ఇది గిన్నిస్ రికార్డ్... 
అమ్మ తన దత్త పుత్రుడి వివాహానికి 100కోట్లు ఖర్చు చేసిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. కాని, ఐటీ శాఖ 10కోట్లు ఖర్చు అయ్యాయని తేల్చింది... 


జయలలిత జీవితంలో వరం, శాపం రెండూ ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళే అంటారు చాలా మంది! శశికళతో ఆమె సాన్నిహిత్యంపై అనేక ప్రచారాలున్నాయి. అయితే, అదే శశికళని జయ ఒక దశలో దూరం పెట్టింది. అప్పుడే శశికళ కుట్ర చేసి స్లో పాయిజన్ ప్రయోగించిందంటారు పడని వారు! దీనికి ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆ తరువాత నుంచే పురుచ్చి తలైవీ సంపూర్ణంగా ఏనాడూ కోలుకోలేదట!


1989లో అసెంబ్లీలోనే కరుణానిధి అనుచరుల చేతిలో  జయ ఘోర పరాభవానికి లోనయ్యారు. 


1992లో కుంభకోణంలో ఆమె ప్రత్యేక పూజలు, స్నానాలు చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 50మంది చనిపోయారు... 


1992 సంవత్సరంలోనే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి తనతో అమర్యాదగా ప్రవర్తించాడని జయ ఆరోపించారు!


1996లో సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టినప్పుడు బయటపడ్డ ఆస్తులు 66 కోట్లు. అయితే, అందరినీ ఆకర్షించినవి 12,000 చీరెలు, 30 కిలోల బంగారం, 2,000 ఎకరాల భూమి, 750 జతల చెప్పులు, 8 క్వింటాళ్ల వెండి… 


1997లో ఆస్తుల జప్తు జరిగినప్పుడు, ఇక ఆభరణాలు ధరించనని ఒట్టు పెట్టుకుని, తిరిగి అధికారంలోకి వచ్చాకే 2011లో ధరించింది… 


పాలనలో ఆమె నియంత. విమర్శలు చేసినా, వార్తలు రాసినా ఎడాపెడా పరువునష్టం కేసులు పెట్టించేది.  


జయలలిత ముందు ప్రదర్శించాల్సిన విధేయత విషయంలో పాతకాలం చక్రవర్తుల రాజ వైభోగం కూడా దిగదుడుపే. అమ్మకు మంత్రులు, ఎమ్మెల్యేల పాదాభివందనాలు చాలా కామన్… 
ఆమె కళ్లల్లోకి నేరుగా చూడొద్దనీ, బొకే ఇచ్చేసి, వెనక్కి తిరిగి వీపు చూపకుండా, వెనక్కి వెనక్కి నడిచిరావాలని గన్ మెన్ చెప్పేవారట…


తమిళ సూపర్ స్టార్, అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మొదట్లో జయను అనుమానించేవాడట. ఆమె ప్రతి కదలికపై నిఘా వేసి ఉంచేవాడట. వీడియో పార్లర్ నడుపుకునే శశికళను కూడా గూఢచర్యం కోసమే ఎంజీఆర్ జయలలిత వద్ద ఉంచాడట… 


1982లో రాజకీయాల్లోకి వచ్చిన జయ 1983లో రాజ్యసభ సభ్యురాలైంది. కాని, వెంటనే  రాజకీయ జీవితాన్నిచ్చిన ఎంజీఆర్ కోపానికీ గురైంది…


1984లో ఎంజీఆర్ కు స్ట్రోక్ వచ్చి, అనారోగ్య సమస్యల్లో ఉంటే... ఈమె రాజీవ్ ను, గవర్నర్ ఖురానాను కలిసి తనను సీఎంను చేయమని అడిగిందంటారు! 


1986లో ఎంజీఆర్ తో పడకపోవటంతో పోటీగా జయలలిత పెరవై అనే సమాంతర ఆర్గనైజేషన్ ను కూడా స్టార్ట్ చేసింది!


ఎంజీఆర్ మరణం తరువాత తిరుగులేకుండా ఎదిగిన జయ 34ఏళ్లలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు!