కుప్పకూలిన జయలలిత?

 

అక్రమ ఆస్తులకు సంబంధించి శిక్ష పడిన జయలలిత కర్ణాటక హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో జైలులో జయలలిత కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఆమెకు జైలులో వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కర్ణాటక హైకోర్టు బెయిల్‌ను తిరస్కరించడంతో ఆమె హతాశురాలైనట్లు చెబుతున్నారు. జైలులో టీవీలో ఈ వార్తను ఆమె చూసినట్టు సమాచారం. ఇదిలా వుంటే, జయలలిత బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. జయలలితకు బెయిల్ రాకపోవడంపై తానమే ఆశ్చర్యపోవడం లేదని, ఇలాగే జరుగుతుందని తాను అనుకున్నానని జయలలిత మీద కేసు పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. జయలలితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అవినీతి అంటే మానవ హక్కుల ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. జయలలిత బెయిల్ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ అభ్యంతరం చెప్పనప్పటికీ బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. జయలలిత శిక్షను నిలిపివేయడానికి కూడా ఏ విధమైన ఆధారం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.