బీజేపీకి జనసేన షాక్.. ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నాం

ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లు జనసేన పార్టీ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకరరావు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇందులో జనసేన పలు అంశాలు ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, 13 జిల్లాల సమగ్రాభివృద్ధే తమ వైఖరని క్లారిటీ ఇచ్చింది. 

 

అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినపుడు అన్ని రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయని కోర్టుకు జనసేన హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వంపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో ఎక్కువమంది పేద, సన్నకారు రైతులు ఉన్నారని.. వారిలోనూ ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని వివరించింది. అమరావతిని అభివృద్ధి చేస్తారని నమ్మి భూములు త్యాగం చేశారని ప్రస్తావించింది.

 

గతంలో అమరావతికి మద్దతిచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక తన అభిప్రాయం మార్చుకుందని పేర్కొంది. మూడు రాజధానుల ఏర్పాటు  చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి.. రాజ్యాంగ, న్యాయపరమైన ప్రాతిపదిక లేదంటూ తన అభిప్రాయాన్ని జనసేన హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం చట్ట సభల సాంప్రదాయాన్ని, రూల్స్ ని అతిక్రమించి బిల్లులను ఆమోదింపచేసుకుందని తెలిపింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది.

 

రాజధాని అంశం ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత గొడవగా మారిందని అభిప్రాయపడింది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి.. ప్రతీకారంతో సాగే పాలన, విభజించి పాలించే కుట్రలు సరికాదని పేర్కొంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ విధానాలు మార్చకూడదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ విధానాల్లో తప్పులు, అక్రమాలుంటే వాటిని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. కానీ విధానాలు మారిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని జనసేన అఫిడవిట్‌ లో పేర్కొంది. 

 

కాగా, బీజేపీ మాత్రం అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరికి తెలియజేయకుండా రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుంటే.. మిత్రపక్షం జనసేన మాత్రం ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పాడం ఆసక్తికరంగా మారింది. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్న బీజేపీ.. రాజధాని విషయంలో జనసేన అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్తుందో లేక ఇలాగే రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందో చూడాలి.