కశ్మీర్‌లో పోలీసుల హతం!

కశ్మీర్‌లో పరిస్థితులు మళ్లీ అదుపుతప్పుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన వేర్వేరు సంఘటనలో ముగ్గురు పోలీసులను తీవ్రవాదులు కాల్చిచంపారు. తీవ్రవాదుల చేతిలో పోలీసులు బలి కావడం మూడు సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. భారత్‌- పాక్‌ సరిహద్దుల వద్ద పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నా, కశ్మీర్‌లో మాత్రం అలజడి చెలరేగుతోందని ఇలాంటి సంఘటనలు సూచిస్తున్నాయి. ప్రతిరోజూ కశ్మీర్ లోయనుంచి తీవ్రవాదులతో సైనికులు పోరు జరుపుతున్న వార్తలు వస్తున్నాయి. స్థానిక ప్రజలు సైతం సైనికుల మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న వేర్పాటువాదుల గొంతుక నానాటికీ బలపడుతోంది. 

 

ఈ తరహా ఉపద్రవాలను ఖండించాల్సిన వివిధ పార్టీలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లిప్తంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జాతీయవాదాన్ని ఒలకబోసే భాజపా, కశ్మీర్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శలు చెలరేగుతున్నాయి. శ్రీనగర్‌ నిట్‌ క్యాంపస్‌లో జరిగిన వివాదమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ వివాదంలో జాతీయతకు అనుకూలంగా నినదించిన విద్యార్థులనే చితకబాదిన ఉదంతం మీడియాలో సంచలనం సృష్టించింది. ఒక పక్క తీవ్రవాదులు, మరో పక్క వేర్పాటువాదులు, ఇంకో పక్క రాజకీయ అవకాశవాదులు... వీరందరి మధ్యా పావులుగా మిగులుతున్నది మాత్రం కశ్మీర్‌ పౌరులే. మరి ఇలాంటి సందర్భంలో వారు సంయమనంతో వ్యవహరిస్తారా లేకపోతే వేర్పాటువాదం వైపు మొగ్గు చూపుతారా అన్నది ఓ భయపెట్టే ప్రశ్నే!