ఇస్రోనా మజాకా!

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే కావచ్చు. కానీ మన అంతరిక్ష పరిశోధనలు మాత్రం ప్రపంచంలోని ఏ దేశానికీ తీసిపోవని దశాబ్దాల క్రితమే నిరూపితం అయ్యింది. మన అంతరిక్ష పితామహుడు విక్రమ సారభాయ్‌ ఏ లక్ష్యంతో అయితే ఇస్రోకు బీజం వేశారో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సతీష్‌ ధావన్‌, అబ్దుల్ కలాం వంటి వందలాది శాస్త్రవేత్తలు తమ మేధస్సుని ధారపోశారు. కుటుంబ జీవితాన్ని సైతం దూరం చేసుకుని తమ జీవితాలను అంకితం చేశారు. అలాంటివారి కృషితో సాగుతున్న ఇస్రో అద్భుతాలు సాధించక ఏం చేస్తుంది. గత నెలలోనే ఇస్రో నావిక్‌ పేరుతో మనదైన ఓ సప్తర్షి మండలాన్ని ఏర్పరుచుకుంది. ఏడు ఉపగ్రహాల సాయంతో పనిచేసే ఈ నావిక్‌ వ్యవస్థ ఇక నుంచి అంతరిక్షం నుంచి మనకు కావల్సిన దారులను చూపించనుంది.

 

ఆ విజయం తాలూకు జ్ఞాపకాలు చెదిరిపోక ముందే అమెరికా సైతం చేతులెత్తేసిన ‘రీయూజబుల్ లాంచ్‌ వెహికల్‌’ (RLV) ను నేడు విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఇప్పటివరకూ అంతరిక్షంలోకి వెళ్లిన వాహనాలను తిరిగి ఉపయోగించే పరిస్థితి లేదు. కానీ ఇస్రో అలాంటి స్థితికి గుడ్ బై చెప్పనుంది. RLV తరహా వ్యోమనౌకలు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావడానికి కనీసం మరో దశాబ్దం అన్నా పట్టవచ్చు. ఇవాళ జరిగిన ప్రయోగం ఆ భవిష్యత్తుకు ఒక పునాది రాయి మాత్రమే! ఇస్రో కనుక RLVకి ఒక తుది రూపుని అందించగలిగితే అంతరిక్షయానాలకి అయ్యే ఖర్చు దాదాపు పదో వంతుకి తగ్గిపోతుంది. దాంతో ఉపగ్రహాలను ప్రయోగించాలన్నా, వ్యోమగాములు ఇతర గ్రహాలకు వెళ్లిరావాలన్నా విమానం ఎక్కినంత సులువైపోతుంది. ఇస్రో ఆ ఘనతలు సాధిస్తుందనడంలో ఎవరికీ ఏ అనుమానం లేదు కదా!