ఢిల్లీని తాకిన క్యాబ్ మంటలు.. జామియా ఇస్లామియా విద్యార్థుల నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు ఢిల్లీని తాకాయి. జామియా నగర్ లో బస్సును తగలబెట్టారు ఆందోళనకారులు. మూడు బస్సులతో పాటు కార్లకు నిప్పంటించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. జామియా నగర్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అయితే హింసాత్మక ఘటనల పై తమకు సంబంధం లేదంటున్నారు జామీయా ఇస్లామియా విద్యార్థులు. తమ ఆందోళనలు శాంతియుతంగా సాగుతున్నాయని చెబుతున్నారు. 

సౌత్ ఢిల్లీ లోని జామియా నగర్ లో భారీ ఎత్తున నిరసనకారులు రోడ్ల పైకి రావడంతో పోలీసులు మోహరించారు. బస్సుల పై రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు హింసాత్మక ఘటనలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.జామియా నగర్ ను మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు.ఢిల్లీ హింస వెనుక ఆప్ ఎమ్మెల్యే ఉన్నారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆప్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ కనుసన్నల్లోనే హింస చెలరేగింది అన్నారు. అయితే దీనిని ఆప్ ఖండించింది.పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి మనకి తెలిసిందే.ఈశాన్యం నుంచి బెంగాల్ కు అక్కడి నుంచి ఢిల్లీకి పాకడం కలకలం రేపుతోంది.మరోవైపు పోలీసుల కాల్పుల్లో అస్సాంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బెంగాల్ లో ఆందోళనకారులు కార్లు బస్సులకు నిప్పంటించారు. సంయమనం పాటించాలని గవర్నర్ కోరినప్పటికీ నిరసనల మాత్రం ఆగడం లేదు.