విజయసాయి రెడ్డికి 'కాపు' సెగ.. పవన్ ఎఫెక్టేనా?

కాపు ఉద్యమ సెగ వైసీపీని చుట్టుముడుతోంది. ఏకంగా వైసీపీ నెం.2 అయిన విజయసాయి రెడ్డి ముందే 'జైకాపు… జైజై కాపు' నినాదాలతో వైసీపీ కాపు కార్యకర్తలు రెచ్చిపోయారు. విశాఖలోని కంబాలకొండలో మంత్రి అవంతి శ్రీనివాస్.. ప్రత్యేకంగా తమ పార్టీకి చెందిన కాపు నేతలు, కార్యకర్తలతో కాపుల ఆత్మీయ కలయిక పేరుతో ఓ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకి విజయసాయిరెడ్డిని ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. అయితే.. ఈ కాపు సభకి హాజరైన విజయసాయికి ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయి అలా సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టారో లేదో.. “జై కాపు.. జై జై కాపు” అంటూ కార్యకర్తలు నినాదాలు హోరెత్తించారు. అప్పటి వరకూ కాపు సామాజికవర్గం కాని ఇతర నేతలు వచ్చినా ఎవరూ స్పందించలేదు.. కానీ విజయసాయి రాగానే ఆయనపై.. కాపు నేతలు, కార్యకర్తలు చెలరేగిపోయారు. కాపు నినాదాలతో హోరెత్తించారు.

సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే.. విజయసాయిపై అంత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆందోళన ముదురుతున్న సమయంలో మంత్రి అవంతి కలగజేసుకునే ప్రయత్నం చేసినా… కాపుల సమావేశానికి రెడ్డిలెందుకు? రెడ్డిలకు ఏం పని? అంటూ కొందరు నిలదీసేందుకు ప్రయత్నించారు. దీంతో విజయసాయి ఆందోళన జరుగుతున్నంత సేపు సైలెంట్ గా కూర్చుండిపోయారు. ఇక నినాదాలు ఆగేలా లేకపోవడంతో.. చివరికి ఆయన కూడా.. తాను కాపునని చెప్పుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలో రెడ్లను కాపులంటారని.. ఆ లెక్కన తాను కాపునని చెప్పుకుని వారిని కూల్ చేయడానికి ప్రయత్నించారు. తానూ కాపునేనని, మీలో ఒక్కడినని.. చనిపోయే ముందు తన డెత్ సర్టిఫికెట్ మీద కాపు అనే ఉంటుందని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. అసంతృప్తి జ్వాలలు మాత్రం ఆగలేదు.

విజయసాయిపై.. కాపు వర్గం నేతలు, కార్యకర్తలు అంత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ నాయుడూ, ప్యాకేజీ స్టారని విజయసాయి చేస్తున్న వ్యాఖ్యలపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారు వేరే పార్టీలో ఉన్నప్పటికీ వారికి పవన్ పై ఎంతో కొంత అభిమానం ఉంటుంది. ఆ విషయాన్ని మరిచి విజయసాయి వంటి నేతలు పవన్ ని నాయుడు అంటూ కులం పేరుతో మరియు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వారికి నచ్చలేదని.. అందుకే వారు విజయసాయి వస్తే ఆ స్థాయిలో నినాదాలతో హోరెత్తించారని అంటున్నారు. మొత్తానికి విజయసాయికి కాపు సెగ గట్టిగానే తాకిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.