పీఎం వస్తే ఎక్స్ సీఎం జంప్
posted on May 3, 2025 10:29AM

రాజధాని పునఃప్రారంభంలో కనీసం ట్వీటు కూడా చేయని జగన్?
ఇదేనా మీకు ఆంధ్రుల పై ప్రేమా?
ఇన్నాళ్లూ మనల్నో ఆంధ్రద్రోహి పాలించాడా? అంటూ జనం కామెంట్లు
రాజధాని అమరావతి అట్టహాసంగా పునః ప్రాంరభమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున హడావిడి కనిపించింది. సందడి కను విందు చేసింది. ఇన్నాళ్ల పోరాటం ఫలించి.. రాజధాని రైతుల కల సాకారమైంది. ఆ ఆనందం వారి కళ్లల్లో ప్రస్ఫుటంగా ప్రతిఫలించింది. అంతే కాదు ఆంధ్ర ప్రజలందరిలోనూ.. మనకంటూ ఒక రాజధాని వచ్చిందన్న సంబరం కొట్టొచ్చినట్టు కనిపించింది. మోడీ సైతం రావడంతో దేశవ్యాప్తంగా అమరావతి పేరు మారు మోగింది.
అంతా బాగుంది కానీ ఒక్కటే మిస్సింగ్.. ఆ మిస్సింగ్ నెంబర్ పేరే వైయస్ జగన్. ఈ ప్రబుద్ధుడు అసెంబ్లీలో ఒక మాట. బయట మరోమాటగా దాగుడు మూతలాడి.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ 2019లో భారీ మెజార్టీతో గెలిచి ఏపీని ఐదేళ్ల పాటు పాలించారు. కట్ చేస్తే.. మూడు ముక్కలాట ఆడి.. అమరావతి పరువు తీశారు. ఉసురు తీయడానికీ ప్రయత్నించారు. ఈ ప్రాంత వాసుల ఉసురు తీసినంత పని చేశారు. వీరి త్యాగాలను అపహాస్యం చేశారు. వీరి భవిష్యత్తుతో పబ్జీ ఆడుకున్నారు.
ఈలోగా 2024 ఎన్నికలొచ్చాయి. ఏక రాజధాని అమరావతా? 3 రాజధానులా? అన్న పందెం జరిగినంత పనైంది. కానీ ఈ పందెంలో మూడు ముక్కల మైండ్ గేమ్.. ముక్కలు చెక్కలై.. 11 స్థానాలకు పరిమితమైంది ఫ్యాను పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అన్న నినాదం ఫలించి కూటమికి 164 సీట్లు దక్కాయి. ఇంతటి విజయం రావడం ఆంధ్రుల్నే కాదు.. ఏకంగా కూటమి అగ్రనేతలైన బాబు, పవన్, లోకేష్ లను సైతం అశ్చర్యపోయేలా చేసింది. జగన్ కి అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.
ఇప్పటికి ఎన్నికల ఫలితాలు వచ్చి అటు ఇటుగా ఏడాది కావస్తోంది. ఈ సరికే ఒక ఆత్మపరిశీలన అవసరం. కానీ జగన్ లో మాత్రం అలాంటిది ఇసుమంతైనా కనిపించట్లేదు, కించిత్ కూడా ఆయన తన పరాజయం పట్ల ఒక విశ్లేషణ చేసుకున్నట్టే కనిపించదు. విజేతలకు శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు. తాము ఎందుకు ఓడామో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది కూడా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టాలి. ఆ ఓటమిని బహిరంగంగా చెప్పకుంటే పోయారు.. కనీసం తమలో తామైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీలో అంతర్గతంగా అయినా ఒక రిపోర్టు తయారు చేసుకోవాలి. అట్ లీస్ట్ వందల కోట్ల రూపాయలతో పెంచి పోషించిన బీహారీ గ్యాంగ్ నుంచైనా నివేదిక తెచ్చుకోవాలి.
ఏ నివేదిక తెచ్చుకున్నా వచ్చే రిజల్ట్ రాజధాని రైతుల ఉసురు తగిలి శ్రీమాన్ జగన్మోహన రెడ్డిగారు దారుణ పరాజయం పాలయ్యారనే వస్తుంది. అలా నిజాలు తెలుసుకోవడం ఎందుకనుకున్నారో ఏమో జగన్ ఎలాంటి నిజ నిర్దారణ చేసుకోలేదు. పోస్టుమార్టం అంతకన్నా నిర్వహించుకోలేదు. ఇంకా అదే చిత్త భ్రమ. ఇంకా అదే మాయలో ఉన్నట్టున్నారు పాపం ‘ఫ్రీ’వారు. అదే అదే ఫ్రీగా పథకాలు ఇచ్చేయగానే గెలిచేస్తామన్న భ్రమల్లో ఉన్న జగన్ సార్.
అందుకే ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. ఇంకా నాలుగేళ్లు మాత్రమే. మధ్యలో జెమిలీగానీ వస్తే రెండేళ్లే అంటూ కాకిలెక్కలు వేసుకుంటున్నారు. మరింత ఓవరాక్షన్లో భాగంగా తాము అధికారంలోకి తిరిగి వచ్చేసినట్టు.. ఏకంగా నష్టపరిహారాల మిగులు బకాయిలు చెల్లిస్తానన్న ప్రకటనలు సైతం చేయిస్తున్నారు.
ఓకే.. ఆశావాదం ఎవరికైనా మంచి విషయమే. ఉండాల్సిందే. కాదనడం లేదు.. కానీ అప్పుడప్పుడూ వాస్తవ పరిస్థితుల్లో జీవించడం కూడా అవసరమే కదా? ఇంత జరిగితే సారీ తప్పయి పోయింది. నేను ముందు ఒక మాట అన్నాను. తర్వాత మాట మార్చాను. నావల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. చెప్పుడు మాటలు విని మోసపోయాను. నేను మీ పక్షమే. అని చెప్పుకోవచ్చు.
సరే అదీ లేక పోతే పోయింది.. రాజధాని పునః ప్రారంభ సమయంలో కనీసం ఈ ప్రాంత వాసులకు, అట్ లీస్ట్ రైతులకైనా.. శుభాకాంక్షలు చెప్పొచ్చు. కానీ జగన్ లో అలాంటి లక్షణాలేవీ ఉన్నట్టే కనిపించదు. ఇక్కడుంటే అలాంటి పని చేయాల్సి వస్తుందనుకున్నారో ఏమో బెంగళూరు చెక్కేశారు.
ఎవరు అవునన్నా కాదన్నా.. అమరావతి రాజధానిగా ఫిక్సయిపోయింది. ఈ దిశగా వచ్చే రోజుల్లో చట్టం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరెంత మొత్తుకున్నా.. రాజధాని హోదా నుంచి ఈ ప్రాంతాన్ని మార్చే వాడే లేడు. రేపటి రోజున జగన్ లక్కు పని చేసి పొరబాటున అధికారంలోకి వచ్చినా.. ఆయన సైతం ప్రజా రాజధానిని మార్చే అవకాశమే లేదు. అలాంటి రాజధాని విషయంలో ముందే మేలుకుని.. ఈ ప్రాంత రైతన్నలకు, ఆంధ్ర ప్రజలకు చిన్న విషస్ చెప్పొచ్చు. కానీ లోకేష్ అన్నట్టు ప్యాలెస్ పిల్లి.. ఈ ప్యాలెస్ నుంచి ఆ ప్యాలెస్ కి చెక్కేయడంతో.. ప్రస్తుతం అందరూ ఆయన్న కసికొద్దీ తిట్టుకుంటున్న దృశ్యం కనిపిస్తోంది.