కోటలు దాటిన మాటలు.. గడపదాటని చేతలు
posted on Apr 5, 2024 9:01AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేదలను ఉద్ధరించడానికే అవతరించానంటూ తన భుజాలు తానే చరుచుకుని మరీ గొప్పగా ప్రచారం చేసుకుంటారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 90శాతానికి పైగా అమలు చేసేశానని గప్పాలు కొట్టుకుంటారు. అయితే వాస్తవంలో ఆయన ఇచ్చిన హామీలలో పూర్తిగా నెరవేర్చినవి ఏమిటన్న లెక్కలు వేస్తే.. ఏ హామీ కూడా పూర్తిగా నెరవేరలేదనే తేలుతోంది. హామీలు అమలు చేస్తున్నా.. బటన్ నొక్కి క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నా అని చెప్పుకుంటున్న జగన్..బటన్ నొక్కిన ఎన్ని రోజులకు ఖాతాలలో డబ్బులు పడుతున్నాయో మాత్రం చెప్పరు.
ఇప్పుడు సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలోనూ అదే జరుగుతోంది. వలంటీర్లపై ఈసీకి ఫిర్యాదులు చేసి వారిని పించన్ల పంపిణీకి దూరం చేసిన తెలుగుదేశం కారణంగానే అవ్వా తాతలకు సమయానికి పింఛన్లు అందలేదని చెప్పుకుంటున్న జగన్.. వాస్తవానికి వారికి పింఛన్లు పంపిణీ చేయడానికి ట్రెజరీలో సొమ్ములు లేవన్న విషయాన్ని దాచిపెట్టడానికి శతథా ప్రయత్నించారు. అయితే నిమ్మల రామానాయుడు జగన్ బాగోతాన్ని బట్టబయలు చేశారు. పంచాయతీల ఖాతాలలో డబ్బులు జమ కాకపోవడం వల్లనే పింఛన్ల పంపిణీ జరగడం లేదన్న వాస్తవాన్ని నిమ్మల బయటపెట్టారు. ఇలా ఒక్కటని కాదు.. ప్రతి పథకం అమలులోనూ జగన్ కుటిలత్వం, కపటత్వం బయటపడుతూనే ఉంది.
పాఠశాల పిల్లలకు పోషకాహారం అంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకున్న జగన్.. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు, చిక్కీ ఇస్తున్నామంటూ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు గుప్పించుకున్నారు. ల్లలకు మేనమామ ఇస్తున్న బహుమతిగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు పిల్లలకు భోజనంలో కోడిగుడ్డు, చిక్కీలు బందయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం ఏమిటా అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. యథా ప్రకారం వాటిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ బిల్లులు ఇవ్వలేదు. బిల్లులు రేపిస్తాం, మాపిస్తాం అంటూ ఇప్పటిదాకా బండినడిపేసిన జగన్ సర్కార్ కారణం అవి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు, జగన్ సర్కారు ఇప్పటిదాకా బిల్లులు ఇవ్వకపోవడమేనట. బిల్లులు వచ్చే నెలలో ఇస్తామంటూ ఈ ఫిబ్రవరి దాకా లాగించిన జగన్ సర్కారు.. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని చేతులెత్తేసిందని కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు.
jyడిగుడ్లు, చిక్కీ సరఫరా దారులకు ప్రభుత్వం, ఈ ఫిబ్రవరి వరకూ 189 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. చిక్కీ సరఫరాచేసే కాంట్రాక్టర్లకే 52 కోట్ల బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు.. ఇకపై మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే వాటిని సరఫరా చేస్తామనీ, లేకుంటే లేదని బల్లగుద్దినట్లు చెప్పేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇప్పుడు బిల్లులు చెల్లించే అవకాశమే లేదు. అసలు మామూలు రోజుల్లేనే బిల్లులు ఇవ్వని జగన్ సర్కారు.. ఇప్పుడు ఇంకేమి ఇస్తుందని కాంట్రాక్టర్లు.. చిక్కీ,కోడిగుడ్ల సరఫరాను నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. హామీలు ఇచ్చేయడం తరువాత సొమ్ములు లేవంటూ చేతులెత్తేయడం ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ కు ఒక రివాజుగా మారిపోయింది. అమ్మ ఒడి నుంచి తీసుకుంటే.. జగన్ సర్కార్ అమలు చేస్తున్న అన్ని పథకాల పరిస్థితీ దాదాపుగా ఇలానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.