ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణం.. జగన్ సర్కార్ మరో నమ్మక ద్రోహం!
posted on Aug 4, 2023 2:40PM
ఏపీలో కంచే చేను మేస్తున్న చందంగా ప్రభుత్వమే పేదలకు ద్రోహం చేస్తున్నది. ఔను ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాల్సిన ప్రభుత్వం వారిని మోసం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. తమది పేదల ప్రభుత్వమంటూ గొప్పగా చెప్పుకుంటూనే జగన్ సర్కార్ ఆ పేదలను నిలువునా మోసం చేస్తున్నది. బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తున్నానంటున్న జగన్ ఒక చేత్తో బటన్ నొక్కి సొమ్ములు ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో అంతకు రెట్టింపు లాగేస్తున్నారు. కానీ జగన్ మాత్రం తాను పేద ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు ఆ మంచి జరగకుండా అడ్డు కోవాలని చూస్తున్నారనీ, తాను పేదల కోసం పాటుపడుతుంటే పెత్తందార్లు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఎదురు విమర్శలు చేస్తున్నారు.
రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో పట్టాలు ఇవ్వడం. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రాంతంలో ఆర్5 జోన్ పేరిట పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పడుతూ ఇచ్చిన తాజీ తీర్పులో జగన్ ప్రభుత్వ అడ్డగోలు మోసానికి సంబంధించి కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అమరావతిలో 25 లే ఔట్లలో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధిస్తుందన్న సంగతి అంతా ముందే ఊహించారు. జగన్ సర్కార్ కూడా స్టే తప్పదని తెలిసే ఉండాలి. అయినా కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం, పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని గాల్లో మేడలు కట్టడం ప్రజలను మోసం చేయడమే. ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగానే ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. పట్టాల పంపిణీకి అనమతి ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పట్టాలపై పేదలకు హక్కు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే లబ్థిదారులకు ఆ భూములపై ఎటువంటి హక్కూ ఉండదని కూడా స్పషం చేసింది. మరి అప్పుడైనా జగన్ వెనక్కు తగ్గలేదు?
నిజానికి వైసీపీ ప్రభుత్వం పేదలను అడ్డం పెట్టుకొని రాజధానిని నాశనం చేయాలని ప్రణాళికలు రచిస్తున్నది. పేదలకు ఇళ్ల నిర్మాణం ముసుగులో.. అమరావతి రాజధాని బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేయాలన్నది జగన్ ప్రణాళికగా చెబుతున్నారు. అందుకే కోర్టు పరిధిలో ఉండగానే నిబంధనలను తుంగలోతొక్కి పట్టాలు ఇచ్చారు. కోర్టు కుదరదన్నా వినకుండా ఇళ్ల నిర్మాణానికి మౌలిక వసతులు కల్పించేలా దొంగ జీవోలు తీసుకొచ్చారు. తీరా ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ అంశంలో అమరావతి రైతుల పిటిషన్ పెండింగ్ లో ఉందని తెలిసీ ఆగమేఘాలమీద సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కానీ, సంపద సృష్టించే.. ఆర్-5 జోన్లో ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణం ఆపాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన భూములను.. రాజధానేతరులకు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది.
మొత్తంగా ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే జగన్ మోహన్ రెడ్డికి పేద ప్రజలపై ప్రేమ ఏ కోశానా కనిపించదు. అమరావతి ప్రణాళికకు విరుద్ధమైన ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టే బదులు.. పేదలు కూడా రాజధానికి దగ్గరలోనే ఉండాలనే చిత్తశుద్ధి ఉంటే.. అమరావతికి దగ్గర్లోనే మరో చోట ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చు. కానీ, జగన్ సర్కార్ ఆ ఆలోచన చేయడం లేదంటే ఇక్కడ పేదలపై ప్రేమ కన్నా.. అమరావతి వినాశనం, పేదల పేరుతో అమరావతి రైతులను, ప్రతిపక్షాల ద్రోహులుగా చిత్రీకరించడమే లక్ష్యంగా కనిపిస్తున్నది.