జగన్ తీహార్ జైలుకు వెళ్ళాక తప్పదా?
posted on May 29, 2012 11:48AM
ప్రస్తుతం హైదరాబాద్ చంచల్ గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న జగన్ త్వరలో ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్ళే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సిబీఐ దర్యాప్తులో అనేక లొసుగులు కనిపిస్తున్నాయి. ఈ దశలో రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జగన్ కేసును దర్యాప్తు చేయటం ప్రారంభించింది. విదేశాల నుంచి అక్రమమార్గంలో జగన్ ప్రాజెక్టుల్లోకి నిధులు వచ్చినట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఒక నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. జగన్ నుండి మరిన్ని విషయాలు రాబట్టేందుకు అతన్ని ఇంటరాగేట్ చేసే అవకాశం కల్పించాలని, రెండు మూడురోజుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని అభ్యర్థించబోతోంది. ఇడి విచారణ అనంతరం జగన్ ను ఆ శాఖ అదుపులోకి తీసుకుని తీహార్ జైలుకు పంపవచ్చునని తెలుస్తోంది.
ఇడి కేసు నమోదు చేస్తే సంబంధిత వ్యక్తి తాను నిర్ధోషినని స్వయంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. సి.ఆర్.పి.సి. కింద కేసు నమోదు చేస్తే దర్యాప్తు సంస్థే నేరారోపణ చేసిన వ్యక్తికీ సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆ వ్యక్తి నేరానికి పాల్పడినట్లుగా రుజువులతో సహా కోర్టు ముందు ఉంచాలి. కానీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేస్తే నేరారోపణకు గురైన వ్యక్తే తనకు తానుగా నేరాలకు పాల్పడలేదని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తనకు విదేశాల నుంచి అక్రమంగా డబ్బు రాలేదంటున్న జగన్ తనకు వచ్చిన ప్రతీపైసాకు లెక్కలు చూపించాల్సిన బాధ్యతా ఉంటుంది. ఇడి కేసుల్లో జగన్ దోషి అని తేలితే అతని అక్రమాస్తులన్నీ జప్తుకు గురవుతాయి.