జగన్ ఆశలు ఆవిరి.. వైసీపీ నేతలకు సలపని ఊపిరి!
posted on Feb 10, 2024 9:24AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చప్పగా ముగిసింది. జగన్ ప్రధానితో భేటీ అయ్యారన్న ఒక్క సంతోషం తప్పితే ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఏఒక్కటీ వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. జగన్ అలా వెళ్లారు..ఇలా వచ్చారు అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రధానితో జగన్ భేటీ కేవలం వినతి పత్రం అందజేయడానికే మాత్రమే పరిమితమైంది. దాదాపు గంట పాటు ప్రధానితో జగన్ మోహన్ రెడ్డి భేటీ సాగిందనీ, ఈ సందర్భంగా మోడీ పలు అంశాలపై చర్చించారంటూ ప్రచారం జగన్ అనుకూల మీడియా ఎంతగా బాకాలు ఊదుకున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఆ వర్గాల సమాచారం మేరకు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానిని కలిసేందుకు జగన్ వెళ్లగా.. అప్పటికే బీజేపీ పెద్దలు మోడీతో భేటీలో ఉన్నారు. దీంతో జగన్ దాదాపు అరగంట సేపు బయటే వెయిటింగ్ రూంలో ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత జగన్ వెళ్లి మోడీకి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తరువాత మోడీతో నామమాత్రంగా రెండుమూడు మాటలు మాట్లాడారు. అప్పటికే సమయం మించిపోవటంతో ఇరువురి భేటీ ముగిసింది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో మరోసారి అధికారం దక్కించుకునేందుకు జగన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మళ్లీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని జగన్ మోహన్ రెడ్డికి సైతం ఇప్పటికే బోధపడింది. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. ఉపాధి లేక యువత, రోజువారి కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస బాట పట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏ వర్గానికీ మేలు జరగలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడటం జగన్, వైసీపీ శ్రేణుల్లో ఓటమి భయాన్ని కలిగించింది. తాజాగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆమె తన సొంత అన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటం వైసీపీకి మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. దీనికి తోడు ఇన్నాళ్లు బీజేపీ మద్దతు ఉందన్న ధీమాతో ఉన్న జగన్ కు గట్టి షాక్ తగిలింది.తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ రెడీ అయిపోయింది. ఇప్పటికే సీట్ల పంపకం విషయంపై అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో చంద్రబాబు భేటీ చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీలోకి దిగడం దాదాపు ఖాయమైంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అసలు జగన్ ఢిల్లీకి వెళ్లింది మోడీతో రాజకీయ అంశాలపై చర్చించేందుకని, కానీ మోడీ ఆ అవకాశం ఇవ్వలేదని వైసీపీ నేతలే చెబుతున్నారు. టీడీపీ ఎన్డీయేలోకి చేరడం ఖాయమన్న వార్తలు రావడంతో.. అలా జరగకుండా అడ్డుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వచ్చారు. ఆ చనువుతో ఎన్డీయేలో మేం చేరతాం.. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టండని మోడీని కోరేందుకే జగన్ ఢల్లీ పర్యటన లక్ష్యమని, అలా కుదరని పక్షంలో ఏపీలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లి.. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టాలని మోడీని కోరాలని జగన్ భావించారని చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, తాము అధికారంలోకి వస్తే ఎలాగూ బీజేపీ వెంటే ఉంటామని జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించాలని భావించారనీ అయితే మోడీ అందుకు ఇసుమంతైనా అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే.. ఆ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లుతుందని, తద్వారా ఏపీలో బీజేపీ బలపడుతుందనీ మోడీకి వివరించి ఆయన మొప్పు, మద్దతు పొందాలన్న ఆశతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ కు ఆ ఆశ ఆవిరైపోయిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. .
అయితే జగన్ అనుకున్నది ఒకటి ఢిల్లీలో జరిగింది మరొకటి అంటున్నారు. జగన్ కేవలం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో మాత్రమే భేటీ అయ్యారు. అమిత్ షా, జేపీ నడ్డాఅప్పాయింట్ మెంట్ జగన్ కు లభించలేదు. దీంతో తానొకటి తలిస్తే ఢిల్లీలో మరొకటి జరిగిందని జగన్ డీలాపడిపోయారని అంటున్నారు. హస్తిన పర్యటన అనంతరం వైసీపీ శ్రేణుల్లో సైతం ఆందోళన మిన్నంటుతోం ఈసారి టీడీపీ కూటమి అధికారంలోకి రావటం దాదాపు ఖాయమైందని సర్వేలు తేటతెల్లం చేస్తున్న క్రమంలో పలువురు వైసీపీ ముఖ్యనేతలు ఆ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంగా జగన్ హస్తిన పర్యటన ఆయనకు కేంద్రం అండ కూడా దూరమైందని తేటతెల్లం చేయడంతో వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.