కాంగ్రెస్ పార్టీకి సింహస్వప్నంలా మారిన జగన్

 

పదిరోజుల్లో తెలంగాణా సంగతి తేల్చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పి విమానం ఎక్కినప్పటికీ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఇంకా రాయల తెలంగాణాపై చర్చలు సాగుతూనే ఉండటం విశేషం.

 

 ఈ 10రోజుల తాజా డెడ్ లైన్ సంగతి ఎలా ఉన్నపటికీ, గత 10 రోజులుగా ప్రధానంగా, ‘సీమంధ్రాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభావం’ గురించే చర్చ సాగింది. అతను జైల్లో ఉన్నపటికీ, ‘అతనిది కూడా తమ డీ.యన్.ఏ.నని’ సాక్షాత్ దిగ్విజయ్ సింగే చెప్పుకొవడం చూస్తే, కాంగ్రెస్ పార్టీ అతని బలాన్ని బాగానే అంచనా వేసిందని చెప్పవచ్చును. రాయలసీమ ప్రాంతంలో బలంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని బలహీనపరచడానికే కాంగ్రెస్ రాయల తెలంగాణా ఎత్తు వేసిందని విశ్లేషణలు తేల్చి చెప్పాయి.

 

ఇక, రాయల తెలంగాణా, 10 రోజుల్లో తెలంగాణా అనే ప్రస్తావనలు రెండు కూడా జగన్ కారణంగానే వచ్చాయని మంత్రి టీజీ. వెంకటేష్ కూడా కనిపెట్టేశారు. అంటే జగన్నిచూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఆయన కూడా తేల్చి చెప్పేశారు. అందువల్ల, ఇప్పుడు ఈ 10 రోజుల్లో తెలంగాణా అనే నిర్ణయం జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేసే విధంగానే ఉండవచ్చునని భావిస్తున్నందునే, ఇంకా రాయల తెలంగాణా సీరియల్ నడుస్తోంది.

 

ఈ సారి 10రోజులంటే ఖచ్చితంగా 10 రోజులే అని కాంగ్రెస్ గనుక భావిస్తే, కాంగ్రెస్ ఎటువంటి తెలంగాణా ఇవ్వబోతోందో మనకీ తెలుసుకొనే అవకాశం దొరుకుతుంది.