రాజుగారి మ‌హ‌త్యం ఏపీ తెర‌ మీద కొత్త చిత్రం

రాజుగారి ప్ర‌తిభ అంద‌రికీ తెలియాల‌ని పూర్వం మంత్రి, సేనాధిప‌తి, ఆయ‌న అసిస్టెంటు అన్ని పెద్ద గ్రామాల్లోకి వెళ్లి ప్ర‌చారం చేసి దేశ‌భ‌క్తి, స్వామిభ‌క్తీ పెంచాల‌నుకున్నారు. ద‌రిదాపుల్లో ఏ యుద్ధ‌మూ వ‌చ్చేది లేకున్నా ఈ రెండు ర‌కాల భ‌క్తి త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల‌కు ఉండి తీరాల‌ని వారి ల‌క్ష్యం. అనుకున్న‌దే త‌డ‌వుగా అస‌లు విష‌యం రాజుగారికి చెప్ప‌కుండానే న‌లుదిక్కులా న‌లుగుర‌యిదుగురితో క‌లిసి ఒక జ‌ట్టుగా పంపేరు మంత్రిగారు. ఆన‌క తీరిగ్గా మామిడితోట‌లో రాజుగారితో క‌లిసి విందు చేస్తూ రాజుగారికి ఈ విష‌యం విన్న‌వించారు. కానీ ఆయ‌న‌కు పెద్ద‌గా సంతోషం క‌ల‌గ‌లేదు. 

ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటేనేమి మ‌నం చేసేది ఎలాగూ చేసేస్తాము, చేసేసేము క‌దా మంత్రీ అన్నారు. అవున ను కోండి కానీ ఇంకేమ‌న్నా చేస్తారే మోన‌ని వారికీ తెలియాలి క‌దా! అందువ‌ల్ల హెచ్చ‌రిక‌గా బృందాల‌ను పుర‌మాయించార‌న‌న్నారు మంత్రి.

రెండురోజుల త‌ర్వాత వెళ్లిన‌వారు రాజ‌ధాని న‌గ‌రానికి తిరిగి వ‌చ్చారు. చేతికి గాయంతో చెంచ‌య్య‌, కాలి వేలు తెగి వెంక‌డు, బుజం దెబ్బ‌తో భుజంగం, వీపు విమానం మోత మోగించుకుని వీర‌మ‌ల్లుడు వ‌చ్చారు. ఏమ‌ర్రా ఏమ‌యింది? ఏమి విన్నారు? ఏమి తెలుసుకున్నారో రాజుగారికి విన్న‌వించుకోండి అని మంత్రి స‌భ‌కి వారిని ఆహ్వానించారు. 

అయ్యా, మీరు చెబితే న‌మ్మ‌రుగాని, మీ పాల‌న గురించి బ‌హు దొడ్డ‌గానే చెప్పుకుంటున్నారు. మొన్న‌టి ప‌థ‌కం గురించి అడిగితే అదేమీ అర్ధంగాన‌ట్టు చూశారు. మీకు అందాల్సిన పైకం అందిందా అంటే మాకు తెలియ‌ద‌న్నారు. ప‌క్కీదిలో పాత్ర‌డుగారికి రెండు బియ్యం మూట‌ల‌ని చెప్పి ప‌ది కేజీల బియ్యం మూట ఇచ్చిపోయారంటండీ. రెండు బ‌జార్ల‌వ‌త‌ల పెన్ష‌ను డ‌బ్బుల గురించి అడిగితే యేలు ముద్ర స‌రిగా ప‌డ‌లేద‌ని స‌గ‌మే ఇచ్చారంటండి. అదండి మ‌రి. అంచేత అంతా ఓపాలి మీ స‌న్నిదికి వ‌ద్దామ‌నే అనుకుంటున్నారంటే, ద్వార‌పాల‌కులే చిల్ల‌ర అడుగుతున్నారు!

మ‌రి నువ్వు మంగాపురం వెళ్లావుగా నీ సంగ‌తేంది మ‌ల్ల‌న్నా.. అని మంత్రిగారు గ‌ర్వంగా చూస్తూ పిలిచారు. ఏం వూరండీ.. ఎడ్లేమో ఛ‌ల్‌పో అన్న క‌ద‌ల‌లేదు. ఈ రోడ్లంట మేం రావ‌ని భీస్మించాయి. స‌రేలే అని నేనే దిగి నెమ్మ‌దిగా న‌డ‌చుకుంటూ ఎల్లేనండి.. త‌మ‌రి గురించి వివ‌రంగా ఏదో చెబుదామ‌ని, అచ్చం మంత్రి గారిచ్చిన చీటీ పెకార‌మే చెప్ప‌బోయానండీ.. అంతే.. అమాంతం ఓ రాయి వొచ్చి త‌ల‌కి త‌గిలిందండి.  గ‌మ్మున లేచి తుండుగుడ్డ త‌ల‌కు క‌ట్టుకున్నానండి. అవ‌త‌ల‌కి బోయి చెంబెడి నీళ్లు తాగి వొచ్చి మ‌ల్లీ చెప్పానండీ.. ఇనుకుంటున్నార‌నుకున్నానండి. ఆల్లు ఇన‌డం లేదు అన్న‌ది త‌ర్వాత తెలిసింది. వాళ్ల‌లో వాల్లే ఏదో అనుకుని ఇల్ల‌కి ఎల్లారండీ.. బోజ‌నానికి ఏర్పాట్లు చేత్తార‌ని మేం అనుకున్నామండి.. అర‌గంట త‌ర్వాతండీ.. క‌ర్ర‌ల‌తో వొచ్చి వీపు ఇమానంమోత మోగించేసీరండీ.. ద‌ణ్ణం బెట్టి ఎడ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చాం. వాటికీ ఎట‌కార‌మేనండీ.. త‌లాడించి బండెక్క‌మ‌న్నాయి!

య‌వ్వారం స‌రిగా లేకుంటే యిట్ట‌నే అన్నీ అవుతాయండీ.. అచ్చ‌న్న‌గారి మాటే ఇనుకుంటున్నారండీ అంద‌రూ. ఆయ‌నెవ‌రో అచ్చ‌న్న‌గారంటండి ఎగ‌స్పార్టీ ఓరంటండీ.. అమాంతం గుర్రంమీద వొచ్చి గ‌బ గ‌బా ఏందేందో మాటాడి ప‌చ్చ‌టి జెండా వూపి ఎల్లారండి.. అంద‌రూ న‌వ్వుకుంటా ఆయ‌నెంటే కొంత దూరం ఎల్లారండీ. మొన్న‌టికి మొన్న రాజ‌ధాన్నుంచి ఇద్ద‌రొచ్చి అయిచ్చాం, ఇయిచ్చాం అందిన‌యా, అంతా బాగున్నారా అని అడిగారండి. మాకేమీ రాలేద‌నే చెప్పావండి. నిజంగూడా అదేగ‌దండీ మ‌రి. కాదు అంద‌రికీ పించ‌న్లుచ్చాం, గింజా పంచాం అన్నారండి. అయి తీసుకున్నారేమో ఎటో పోయారండి, మ‌రి మా గ్రామంలో మాత్రం ఏమీ ఇవ్వ‌లేదంటే న‌మ్మ‌రే. మా ప‌క్కింటి పెద్ద రైతుకి, టీచ‌ర‌మ్మ‌కీ కోపం వ‌చ్చి తిట్టారండీ. ఇదేమ‌న్నా తాయ‌త్తు మ‌హిమా.. ఇవ్వందే ఇల్లంతా నిండ‌డానికి? గ‌ట్టిగా అరిచేస‌రికి తిరిగెల్లారు. 
అంత‌లో మ‌రొక‌డు అందుకున్నాడు. ఆ గుర్రం మీదొచ్చిన ప‌చ్చ‌జెండాయ‌న మాత్రం అన్నీ అడిగి మీకు నేనున్నాను ఏం బ‌య‌ప‌డొద్దు, మీకురావ‌ల‌సిన‌దాన్ని గెట్టిగా అడ‌గండ‌ని చెప్పారండి. అందుకే అంద‌రం మ‌రి నిలదీసామండి. వ‌చ్చినోల్లు మ‌రి మీకేం చెప్పారో తెలీదండి. మ‌మ్మ‌ల్ని కొట్టించ‌డానికేమ‌న్నా చెప్పార‌నే బ‌యంతో  ఇట్టొచ్చామండీ.. మ‌రి రేపు ఎల్లాలా వొద్దా అని అడ‌గ‌నీకి వ‌చ్చామండీ.. మ‌రి మీరు సెల‌వీయాలండీ! రాజుగారు మంత్రి వంక చూసి కోప‌గించుకున్నారు. మంత్రి మొహం తిప్పుకున్నాడు. మ‌రో మంత్రి టిఫిన్‌కి  ప‌క్కంటికి ఎల్లి ఇడ్లీలు లేవంటే రెండు మిర్చీలన్నా ఇయ్య‌మ‌న్నాడు. పిండి రేటు పెంచిన‌వ్ ఇట్టెట్టాన య్యా దొరా అన్న‌దా హోట‌ల్ ఓన‌ర్‌.  
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ప్రస్తుతం సరిగ్గా ఇలాగే ఉంది. మూడేళ్ల పాలనలో అద్బుతాలు చేసేశాం. మీట నొక్కి పేదల అవసరాలన్నీ తీర్చేశాం. మా ఘనతలు ఇవీ అంటూ గడపగడపకూ చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలను పురమాయించారు. గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ వీరంతా తిరుగుతుంటే ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసన సెగలు రగులుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో అద్వాన పరిస్థితి, ఊహాతీతంగా పెరిగిపోయిన నిత్యావసారల ధరల కు నిరసనగా విపక్షం చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేష జన స్పందన లభిస్తోంది. గడపగడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు ప్రజల ఆగ్రహ జ్వాలలకు గురౌతుంటే.. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజలకు వివరించేందుకు వెళుతున్న విపక్ష నేతలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రభుత్వ గడపగడపకూ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతుంటే... బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా దూసుకుపోతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu