మందు బాబులకు జగన్ బిగ్ షాక్!

2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం నిషేధంపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలలో మద్య నిషేధం కూడా ఒకటి.   రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తా.. మందు అంటే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే దొరికేదిగా చేస్తా అంటూ  జగన్ అప్పట్లో ఎన్నికల ప్రచారంలో  ఊదరగొట్టేశారు. మైకు అందుకున్న ప్రతి సభలో ఒక చేత్తో ఫ్యాన్ గుర్తు చూపిస్తూ ఓట్లడిగారు. కానీ  తీరా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక మద్య నిషేధం సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వమే మద్యం అమ్ముతూ.. అదే మద్యాన్ని ఆదాయంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు జగన్. వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పు చేశారు. అంటే మద్య నిషేధం అన్న వాగ్దానానికి తిలోదకాలు వదిలేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో తొలి మూడేళ్లు మద్య నిషేధం ఎప్పుడు అంటే విడతల వారీగా అన్నారు. గత ఏడాది నుండి అసలు ఇక ఆ ఊసే ఎత్తడం లేదు.  అంతే కాదు ఎన్నడూ వినని కనని నాసిరకం బ్రాండ్లను తెచ్చారు. ఇష్టారాజ్యంగా చిత్ర విచిత్రమైన పేర్లతో మద్యాన్ని అమ్మేస్తూ ఖజానా నింపుకుంటూ పేదల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు పన్నులు, సవరణల పేరిట ధరలు పెంచేసి జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు.

ఔను జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మందు బాబులకు మరో  బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఏపీలో కొన్ని బ్రాండ్ ల మద్యం రేట్లు పెంచేయడానికి రంగం సిద్థం చేసింది. పన్నుల సవరణల పేరిట మందుబాబులపై మరో బాంబ్  పేల్చింది. ఆదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని ఆయా బ్రాండ్ల వారీగా మూల ధరలపై శాతాల రూపంలో  వసూలు చేయాలని డిసైడ్ అయ్యింది. అదుకు తగ్గట్లు వ్యాట్, ఏఈడీని సవరించింది.  ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.  శనివారం (నవంబర్ 18) నుండే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో కొన్ని బ్రాండ్ల లిక్కర్ ధరలు క్వార్టర్ బాటిల్ రూ.10నుంచి 40, హాఫ్ రూ.10 నుంచి 50, ఫుల్ రూ.10-90ల వరకు పెరిగాయి. ప్రస్తుతం ఏఆర్‌ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చనున్నట్లు తెలిపింది. సరళంగా, సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం పన్నుల సవరణ పేరుతో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 పెంచింది. 

ఈ పెరిగిన ధరలతో ఐఎంఎఫ్ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో  పేర్కొంది. దీని ప్రకారం.. మద్యం ధరల పెరుగుదల ఇలా ఉంది. ఫుల్‌ బాటిల్‌ లిక్కర్ ధర ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది  రూ 20 పెరిగి రూ.590కి చేరింది. క్వార్టర్‌ రూ.200 నుంచి రూ.210కి  పెరిగింది. అయితే, అన్ని రకాల బ్రాండ్ల ధరలు ఒకేలా లేవు. మందు బాబులకు బాగా తెలిసిన అరిస్టోక్రాట్ ప్రిమియమ్, సుపీరియర్ విస్కీ, బ్యాగ్ పైపర్, గోల్డ్ రిజర్వ్ విస్కీలపై 750 ఎంఎల్‌కు 90 రూపాయలు వరకూ పెంచారు.  

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీలో మద్యం ధరలను విపరీతంగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో వందకి వంద శాతం ధరలను పెంచేసి మందుబాబుల జేబులు గుల్ల చేశారు. సామాన్య ప్రజలు తాగే క్వార్టర్ వంద రూపాయలు ఉండే మద్యాన్ని రెండు వందలకు  పెంచేశారు. దీంతో ఏపీ సరిహద్దు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున మద్యం అక్రమ  సరఫరా పెరిగిపోయింది. పోలీసులు కూడా కట్టడి చేయలేక చేతులెత్తేయడంతో ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం వస్తుండడంతో  ధరలను కాస్త తగ్గించారు. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఇలా మద్యం ధరలు పెంచేశారు. అయితే ధరలు పెంచితే పెంచారు కానీ.. మంచి బ్రాండ్ల మద్యం అమ్మితే కనీసం మా ఆరోగ్యాలైనా బాగుంటాయని ఏపీలో మందుబాబులు వాపోతుండటం కొసమెరుపు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu