స్పీకర్ కి బుద్ది జ్ఞానం లేదుట

 

జగన్ తన సెక్యూరిటీ గార్డును వంగోబెట్టి అతని వీపుని తన చెయ్యి, మైకు పెట్టుకొనే టేబిల్ గా వాడుకొని విమర్శల పాలయ్యారు. ఆ తరువాత తనని కొడుకు వంటివాడు అని అన్నందుకు దిగ్విజయ్ సింగ్ చెంప చెళ్ళుమనిపించాలన్నారు. మళ్ళీ ఇప్పుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు అసలు బుద్ది జ్ఞానం ఉందా? అంటూ నోరుపారేసుకొని మరోమారు అందరి నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆపార్టీ నేత అంబటి రాంబాబు బుద్ధి జ్ఞానం అనేవేమయినా బూతు మాటలా? అని ఎదురు ప్రశ్నిస్తూ అతితెలివి ప్రదర్శిస్తున్నారు. గట్టిగా రెండు మూడేళ్ళు రాజకీయానుభవం కూడా లేని జగన్మోహన్ రెడ్డి తనకంటే వయసులో, రాజకీయానుభవంలో, ఉన్నత హోదాలో ఉన్నవారిపట్ల నోటికొచ్చినట్లు మాట్లాడటం కేవలం తన అంగబలం, అర్ధం బలం చూసుకొనేనని అర్ధం అవుతోంది. అయితే పద్దెనిమిది నెలల పాటు చంచల్ గూడా జైలులో ఉన్నపుడు, తనను తన డబ్బు, మంది మార్బలమూ కాపాడలేకపోయాయని సంగతి గ్రహించి ఉంటే ఈవిధంగా తన స్థాయికి మించి మాట్లాడి ఉండేవారు కారు. దిగ్విజయ్ సింగ్ ను చెంప దెబ్బకొట్టాలని అన్నపుడు, ఆయన కూడా జగన్ లాగ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడలేదు. సరికదా అలా అన్నపటికీ అతను నా కొడుకు వంటివాడేనని ఎంతో హుందాగా జవాబిచ్చారు. నేడు అంబటి రాంబాబు వంటి వారు జగన్ అహంకారాన్ని తెలివిగా వెనకేసుకు రావచ్చును. కానీ ఏదో ఒకనాడు అతను కూడా జగన్ అహంకారానికి బలై పార్టీ నుండి బయటకి గెంటబడే అవకాశం ఉంది.