నారాయణ గెలుపు నల్లేరు మీద బండి నడకే!

గత ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలోని మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలలోనూ విజయకేతనం ఎగుర వేసింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వైసీపీ పరిస్థితి జిల్లాలో పూర్తిగా దిగజారింది. పరిశీలకుల విశ్లేషణలైతే జిల్లాలో గత ఎన్నికలలో వచ్చిన ఫలితం ఈ సారి రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్నట్లుగా సాగుతున్నాయి. ఐదేళ్ల కిందటి పరిస్థితికీ, ఇప్పటికీ జిల్లా రాజకీయాలలో గణనీయమైన మార్పు వచ్చిందనడంలో సందేహం లేదు. 

ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంో తెలుగుదేశం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పొన్నూరు నారాయణకు పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారాయని వైసీపీ శ్రేణులే అంగీకరించేస్తున్నాయి. ఆయన విజయం సాధించడమే కాదు, భారీ మెజారిటీ కూడా సాధిస్తారని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో నారాయణకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనీత్ కుమార్ యాదవ్ తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. దీంతో వైసీపీ ఆయనను అక్కడ నుంచి తప్పించి ఖలీల్ అహ్మద్ ను రంగంలోకి దింపింది. ఈ నిర్ణయం ఖలీల్ ఆహ్మద్ కు ప్రతికూలంగా మారిందని చెబుతున్నారు.

వైసీపీలో అంతర్గత విభేదాలు, నియోజకవర్గంలో కనిపించని అభివృద్ధి, అలాగే మొత్తంగా  అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత అన్నీ కలిసి నారాయణకు నియోజకవర్గంలో విజయాన్ని సునాయాసం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి.  వీటికి తోడు తాను మంత్రిగా, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గ అభివృద్ధికి నారాయణ చేసిన కృషి ఆయనకు పెద్ద ప్లస్ అయ్యింది. అలాగే ఈ ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం నారాయణపై కేసుల పేరిటి వేధింపులకు పాల్పడటం కూడా ఆయన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తడానికి దోహదపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏ విధంగా చూసినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు.