సమైక్యం పేరిట విభజన

 

జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకి పోలీసుల అనుమతి దొరుకుతుందో లేదో, దొరికినా సభని తెలంగాణావాదులు జరుగనిస్తారో లేదో తెలియదు. కానీ, అతను పన్నిన ఈ వ్యూహంతో ఏపీఎన్జీవోల మధ్య ఊహించినట్లే చీలికలు సృష్టించగలిగాడు. ఇంతవరకు రాజకీయ పార్టీలను దూరంగా ఉంచుతూ ఎంతో ఐకమత్యంగా సమైక్యఉద్యమం చేస్తున్నఎన్జీవోలు, కొందరు అతని సభలో పాల్గోనాలని, మరి కొందరు దూరంగా ఉండాలని నిశ్చయించుకావడంతో చీలికలు మొదలయ్యాయి. హైదరాబాద్ సచివాలయ సీమంధ్ర ఉద్యోగులు, అదేవిధంగా సీమంధ్ర ప్రాంతం నుండి మరి కొంత మంది ఉద్యోగులు ఈ సభలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

గత రెండు నెలలుగా కేవలం ఏపీయన్జీవోలు చేస్తున్న సమ్మె కారణంగానే రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేయలేకపోతున్న కేంద్రం, ఇప్పుడు జగన్ వలన వారిలో చీలికలు ఏర్పడితే ఇక త్వరలో తన పని మొదలుపెడుతుంది. అక్టోబర్ మొదటి వారంలో టీ-బిల్లు క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టి తీరుతామని బల్ల గుద్ది మరీ చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఏపీఎన్జీవోలు తమ సమ్మెను అక్టోబర్ 15వరకు పొడిగిస్తున్నామని ప్రకటించగానే, టీ-బిల్లుని కూడా సరిగ్గా రెండు వారాలకి వాయిదా వేసుకోవడం గమనిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగులు వెనక్కి తగ్గగానే రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు అర్ధం అవుతోంది.

 

జగన్ సమైక్యాంధ్ర సభ అంటూనే ముందుగాఉద్యోగుల సమైక్యఉద్యమాన్ని దెబ్బతీయడం గమనిస్తే, అతను రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఉద్యోగుల సమ్మెను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూనే, మరో వైపు వారికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పబడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించేందుకు, ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన బొత్స, ఆనం, చిరంజీవి వంటి కొందరు సీమంధ్ర కాంగ్రెస్ నేతలతో పావులు కదుపుతోంది.

 

అందుకే కుంటి సాకులు చెప్పి టీ-బిల్లుని రెండు వారాలకి వాయిదా వేసుకొంది. బహుశః ఈ రెండు పనులు రాగల 10-15రోజుల్లో పూర్తి చేసి రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. జగన్ హైదరాబాదులో తలపెట్టిన సమైక్య సభ తేదీ (అక్టోబర్ 19)యే ఇందుకు ముహూర్తమేమో?