ఐఎస్‌ ఉగ్రవాదులు... ఇంట్లోకి వచ్చేశారు

 

ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఐఎస్ అనే తీవ్రవాద సంస్థ ఉందన్న విషయమే చాలామంది భారతీయులకి తెలియదు. తెలిసినా అదేదో సిరియాకు సంబంధించిన అతివాద సంస్థ అనీ, ఏదో అంతర్యుద్ధంలో మునిగిపోయిందనీ భావించేవారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఐఎస్‌ పంజా ప్రపంచమంతటా విస్తరించడం మొదలుపెట్టింది. పట్టించుకుని తీరాల్సిన పని పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అమెరికా వరకూ ఐఎస్ బారిన పడ్డ దేశాల జాబితా పెరిగిపోతూ వచ్చింది. ఆ జాబితాలో ఇప్పుడు మన దేశం కూడా చేరే ప్రమాదమే ఉలిక్కిపడేలా చేస్తోంది.

 

ఐఎస్‌ సానుభూతిపరులు మన దేశంలో మారణహోమాన్ని సృష్టించాలనుకోవడం కొత్తేమీ కాదు. గత ఆరు నెలలోనే ఇలాంటి రెండు ప్రయత్నాలను మన నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ముంబైలోనూ, రూర్కెలాలోనూ ఐఎస్‌ దాడులను అడ్డుకున్నాయి. అయితే అవన్నీ సిరియాలోని మాతృసంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు పన్నిన వ్యూహాలు కావు. కానీ నిన్న హైదరాబాదులో భగ్నం చేసిన ఉగ్రవాదుల వ్యూహం మాత్రం ఇందుకు విరుద్ధం! దానికి సహకరించిన వ్యక్తులు, సమకూర్చుకున్న మారణాయుధాలు, ఎంచుకున్న ప్రణాళిక.. ఐఎస్‌ మనకు ఎంత సమీపంలోకి వచ్చేసిందో తెలియచేస్తున్నాయి.

 

హైదరాబాదుకి చెందిన ‘మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ’ మరో నలుగురు ఉగ్రవాదులతో కలిసి భాగ్యనగరంలో మారణహోమాన్ని సృష్టించడానికి పక్కా ప్రణాళికను రచించాడు. ఐటీ ఉద్యోగులు సరదాగా గడిపే శనివారం రాత్రి మాదాపూర్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించాలనుకున్నారు. రక్షణదళాలన్నీ ఆ విధ్వంసం దగ్గర మోహరించగానే, ఆదివారం మరికొన్ని ప్రదేశాలకు తన దాడులను విస్తరించాలనుకున్నాడు. పనిలో పనిగా గోమాంసాన్ని ఆలయాలలో వేసి హిందువులను రెచ్చగొట్టేందుకు సిద్ధపడ్డాడు. అసలే ఉగ్రదాడులతో ఉలిక్కిపడే హిందువులు, ఇలాంటి పనులతో మరింతగా రెచ్చిపోతారన్నది యజ్దానీ వ్యూహం. అదను చూసి ఓ బీజేపీ ఎమ్మెల్యేని కూడా హతమారిస్తే మతఘర్షణలు మరింతగా చెలరేగుతాయన్నది అతని పన్నాగం.

 

యజ్దానీ వ్యూహాలు ఏవో కాగితాల వరకు పరిమితమైనవి కావు. సిరియాలో ఉన్న ఐఎస్‌ పెద్దలతో స్వయంగా చర్చించి, దాడులకి తగిన మారణాయుధాలను సేకరించి ఏర్పరుచుకున్న కార్యాచరణ. స్వయంగా మెకానికల్‌ ఇంజనీర్‌ అయిన యజ్దానీ కనీసం 40-50 బాంబులకు కావల్సిన రసాయనాలను సమకూర్చుకున్నాడని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. లండన్‌, ప్యారిస్‌, బ్రెసిల్స్... వంటి ప్రాంతాల్లో మారణహోమం సృష్టించేందుకు ఎలాంటి పేలుడుపదార్థాలను ఉపయోగించారో, ఇక్కడా వాటినే సమకూర్చుకున్నారని తేలింది. అదృష్టవశాత్తూ నిఘావర్గాలు అప్రమత్తంగా వ్యవహరించాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏమిటన్నది ఊహించడానికే ఒళ్లు గగుర్పొడిచే ప్రశ్న!

 

యజ్దానీ దాడులు వాస్తవరూపం ధరిస్తే ప్రాణనష్టం ఎలాగూ ఉంటుంది. దానికి తోడు భాగ్యనగరంలోని మతసామరస్యం శాశ్వతంగా దెబ్బతినేది. ఇక ఇక్కడి ఐటీ రంగం మీదా మచ్చపడేది. వీటిని బట్టి యజ్దానీ కుట్ర ఎంత విద్వేషపూరితమైనదో గ్రహించవచ్చు. ఇప్పుడు ఒక యజ్దానీని పట్టుకున్నంత మాత్రాన ప్రమాదం తప్పిపోలేదు. హైదరాబాదులో ఐఎస్‌ సానుభూతిపరులు నానాటికీ పెరిగిపోతున్నారని గణాంకాలే చెబుతున్నాయి. వారిలో ఏ ఒక్కరు బరితెగించినా భారీగా నష్టం వాటిల్లనుందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగమే దీనికి బలికావచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే ఐటీ సంస్థలలో ఆర్థికపరమైన లక్ష్యాల పట్ల ఉన్న శ్రద్ధ అంతర్గత భద్రత పట్ల లేదని అనేక నివేదికలు రుజుబుచేస్తున్నాయి. దాదాపు 90 శాతం కంపెనీలలోకి మారణాయుధాలతో ప్రవేశించవచ్చని తేలింది. ఆర్థికమైన దన్ను ఉన్న ఐటీ పరిశ్రమల పరిస్థితే ఇలా ఉంటే ఇక షాపింగ్‌మాల్స్‌, సినిమాహాళ్లు, హోటళ్ల సంగతి చెప్పేదేముంది. కాబట్టి ఇప్పుడ యజ్దానీని పట్టుకున్నందుకు సంబరపడటం కాదు, అలాంటివారు తమ ప్రణాళికను అమలుపరిచే ప్రమాదం ఎక్కడెక్కడ పొంచి ఉందో పసిగట్టడం. ఎందుకంటే ప్రతిసారీ నిఘావర్గాల మీదే మన భద్రతా బాధ్యతలను మోపలేము కదా!