జగన్‌కు కోలుకోలేని దెబ్బ

 

జగన్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసుకుందన్న వార్తతో ఇవాళ తెలుగు రాష్ట్రాలు నిద్ర లేచాయి. నిజానికి ఇలాంటి ఎదురుదెబ్బలు జగన్‌కు కొత్తేమీ కాదు. కోర్టు బోనుల్లో నిల్చోవడం, జైలుకి వెళ్లి రావడం, ఆస్తులు జప్తు కావడం... ఈపాటికే జగన్ జీవితంలో భాగమైపోయాయి. కానీ ఈసారి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌) తీసుకున్న చర్య మాత్రం ఆయనను దివాళా అంచుల దాకా తీసుకువెళ్లే ప్రమాదం లేకపోలేదు. కుటుంబసమేతంగా బ్రిటన్‌లో కాస్త సేదతీరి తిరిగి రాజకీయాలలో చెలరేగిపోదామనుకున్న ఆయనకు ఇది దుర్వార్తే!

 

ఈడీ జప్తు చేసిన జగన్‌ ఆస్తుల విలువ 749 కోట్లు అన్నది అధికార ప్రకటన. కానీ బహిరంగ విపణిలో వీటి విలువ ఐదారు రెట్లు అధికంగా ఉండవచ్చని ఓ అంచనా. గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన 903 ఎకరాల విలువే 500 కోట్లకు పైగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక గూగుల్‌లో jagan mohan reddy అని టైప్ చేయగానే సెర్చ్‌లోని మొదటి వరుసలో కనిపించేది ఆయన ఇల్లే! బెంగళూరులోని శివారులో అంగరంగవైభవంగా కట్టుకున్న ఆయన భవనం కాస్తా ఇప్పుడు ఈడీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇక హైదరాబాద్‌, లోటస్ పాండ్‌లోని ఇంటిదీ అదే దారి. ఇలా భవంతులూ, షేర్లూ, ఫిక్సిడ్‌ డిపాజిట్లూ... అటాచ్‌మెంటుకి కావేవీ అనర్హం అన్నట్లుగా జగన్‌కు చెందిన వందల కోట్ల ఆస్తిని ఈడీ చేజిక్కించుకుంది.

 

ఇంతకీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ ఈ ఆస్తులను ఎందుకు జప్తు చేసుకుంది అన్నదానికి స్పష్టమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్‌ తనకు అందిన ముడుపులను న్యాయబద్ధం చేసుకునేందుకు వాటిని భారతి సిమెంట్స్‌ వంటి సంస్థలలో పెట్టుబడులుగా చూపించారన్నది ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇలా అక్రమమైన పెట్టుబడులను పెట్టడం ఒక ఎత్తయితే... ప్రభుత్వం దగ్గర ఉన్న పలుకుబడితో అనేక కాంట్రాక్టులను చేజిక్కించుకుని, వాటిని తిరిగి ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారన్నది మరో ఆరోపణ. ఈ తతంగాన్ని వెనుక ఉండి నడిపించింది జగనేనని ఈడీ నమ్ముతోంది. ఈ నేరంలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయిరెడ్డి వంటివారు కూడా జగన్‌తో పాటుగా విచారణను ఎదుర్కొంటున్నారు.

 

జగన్‌ మీద ఏవో ఒక ఆరోపణలు రావడం, ఏవో ఒక కేసులు నడవడం కొత్తేమీ కాదు. కానీ ఈడీ ఈ స్థాయిలో విరుచుకుపడటం మాత్రం వైఎస్‌ఆర్‌సీపీకి ఊహించని ఎదురుదెబ్బే! ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాపు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ, అమరావతి నిర్మాణం మీద సందేహాలను కలిగించడంలోనూ... అక్కడి పార్టీ శ్రేణులు ఇప్పుడిప్పుడే బలాన్ని పుంజుకుంటున్నాయి.

 

అక్కడ ప్రతిపక్ష పాత్రను వహించడంలో వైఎస్‌ఆర్‌సీపీతో పాటుగా సాక్షి కూడా తనదైన భూమికను నిర్వహిస్తోంది. ఇలాంటి సందర్భంలో సాక్షి పత్రిక, టీవీఛానల్ ఉన్న మీడియా భవంతిని కూడా ఈడీ జప్తు చేసుకోవడంతో ఇప్పుడు సాక్షి పత్రిక కూడా ఎదురీదక తప్పని స్థితి వచ్చింది. జులై ఎనిమిది నుంచి ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతూ మరింత వేగాన్ని సాధిద్దామనుకున్న జగన్‌ ఇప్పుడెలా స్పందిస్తారన్నదే ‘కోట్ల రూపాయల’ ప్రశ్న! ఈడీ జప్తు చేసిన ఆస్తులు తాత్కాలిక చర్యే కాబట్టి, వాటిని విడిపించుకునే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఒక పక్క చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటూనే మడమ తిప్పకుండా రాజకీయ చదరంగంలో సైతం తన దూకుడిని చూపిస్తారా? అన్నవి కొద్ది రోజులలోనే తేలిపోయే జవాబులు!