రోశయ్యకు ఎన్టీఆర్ భయపడ్డారా? అందుకే మండలి రద్దు చేశారా?
posted on Dec 4, 2021 12:07PM
కొణిజేటి రోశయ్య. మాటల మాంత్రికుడు. రాజకీయ ఉద్దండుడు. ఆంధ్రప్రదేశ్ చాణక్యుడు. అధికారం ఏ పార్టీదైనా.. ముఖ్యమంత్రి ఎవరైనా.. సభలో మాత్రం రోశయ్యదే అప్పర్ హ్యాండ్. కాంగ్రెస్ పవర్‌లో ఉంటే.. ప్రతిపక్షం ఫసక్. కాంగ్రెస్ విపక్షంలో ఉంటే.. పవర్‌లో ఉన్న పార్టీ ఫసక్. దటీజ్ రోశయ్య. సభలో ఆయన మైక్ అందుకున్నారంటే.. ఇక ఏకపాత్రాభినయమే. ప్రత్యర్థి పార్టీకి దబిడి దిబిడే. అందుకే అంటారు.. తింటే గారెలు తినాలి.. వింటే రోశయ్య ప్రసంగం వినాలి అని.
ఇక.. వాగ్ధాటికి, అనర్గళ ప్రసంగాలకి, దూకుడుకి.. పెట్టింది పేరైన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు సైతం రోశయ్య ధాటికి ఇబ్బంది పడేవారని అంటారు. 1983లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కు.. సభలో రోశయ్య చుక్కలు చూపించే వారని చెబుతారు. తొలినాళ్లలో ఎన్టీఆర్ బాగా దూకుడుగా ఉండేవారు. అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. లాభనష్టాలను పెద్దగా పట్టించుకోకుండా.. అది ప్రజలకు మంచి చేస్తుందని తాను భావిస్తే చాలు.. ఆ నిర్ణయాన్ని అమలు పరిచేవారు. అప్పట్లో ఆయనకు ఎదురుచెప్పడమంటే పెద్ద శాహసమే. అలాంటిది రోశయ్య మాత్రం తనదైన ప్రశ్నలతో, ప్రసంగాలతో సభలో ఎన్టీఆర్‌ను నిలదీస్తుంటే.. అన్నగారే ఉక్కిరిబిక్కిరి అయ్యేవారని ఆ నాటి నేతలు గుర్తు చేస్తున్నారు.
అయితే, నాదెండ్ల వెన్నుపోటు తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లి.. 1985లో అఖండ మెజార్టీతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు రామారావు. సీఎం అయిన వెంటనే.. 1985, మే 31న శాసన మండలిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో అది ఊహించని పరిణామం. రాష్ట్రానికి మండలి అనవసరమని.. అదనపు ఖర్చు అని.. చేతికి ఆరోవేలు లాంటిదంటూ.. ఒక్క నిర్ణయంతో శాసన మండలిని క్యాన్సిల్ చేసేశారు ఎన్టీఆర్. అయితే, ఆ నిర్ణయం రోశయ్య అంటే భయంతోనే తీసుకున్నారని అనేవారు.
ఆ సమయానికి మండలిలో టీడీపీకి మెజార్టీ సంఖ్యాబలం లేదు. పైగా మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా కొణిజేటి రోశయ్య ఉన్నారు. మండలిలో రోశయ్యను తట్టుకొని నిలవడం అంత ఈజీ కాదని ఎన్టీఆర్‌కు బాగా తెలుసు. తాను తీసుకురాదలచుకున్న పలు బిల్లులను, కొత్త చట్టాలు, పథకాలను.. రోశయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మండలిలో అడ్డుకుంటుందని ఎన్టీఆర్ భావించారని అంటారు. అందుకే, మండలిలో రోశయ్య దూకుడును ఎదుర్కోలేకే.. ఎన్టీఆర్ ఏకంగా మండలినే రద్దు చేశారని చెబుతారు. అలా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి శాసన మండలిని రద్దు చేసి సంచలనంగా నిలిచారు ఎన్టీఆర్. అప్పుడు ఆయన రద్దు చేసిన మండలిని.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పునరుద్దరించారు. అయితే, దాదాపు 15 ఏళ్ల తర్వాత తండ్రి తీసుకొచ్చిన మండలిని.. వైఎస్ జగన్‌రెడ్డి రద్దు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా, మండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది వైసీపీ సర్కారు. అప్పట్లో రోశయ్య భయానికి ఎన్టీఆర్ పెద్దల సభను రద్దు చేస్తే.. ఇప్పుడు టీడీపీ భయానికి జగన్ మండలిని పడగొట్టాలని ప్రయత్నించి తోకముడిచారు.