సీపీఎస్ రద్దు అంటే ఇదా జగన్ రెడ్డీ!

వైసీపీ అధిపూత జగన్ రెడ్డి.. ప్రతిపక్ష నేతగా ఉండగా చేసిన పాదయాత్రలో  సీపీఎస్ రద్దు చేస్తానని ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అదీ కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన జస్ట్ వారం రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకొంటామని విస్పష్టంగా చెప్పారు.  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ  ఘన విజయం సాధించింది. దీంతో   జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 

నాటి నుంచి నేటి వరకు.. అంటే  ఈ నాలుగేళ్లలో.. సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి  జగన్ స్పందించ లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం నెలకొంది. ఆ క్రమంలో ఉద్యోగులు.. నిరసనలు, ఆందోళనలతో రోడ్డు ఎక్కడమే కాదు.. ఉద్యమాలు సైతం చేపట్టారు. అలాగే నిరసన దీక్షలూ చేశారు.  

అలాంటి వేళ.. ఈ అంశంపై జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీపీఎస్ రద్దు చేయలేమని ప్రకటించారు.   సీపీఎస్ రద్దు విషయంలో సీఎం వైయస్ జగన్ అవగాహన లేకుండా హామీ ఇచ్చారని కుండబద్దలు కొట్టేశారు. ఓ వేళ  సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటే...   రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాత్రం నాన్చుడు బేరం లేకుండా లెక్క తేల్చేశారు. 
 దీంతో సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ వైఖరి ఏమిటో ఉద్యోగులకు అర్థమైపోయింది. అయితే తాజాగా సీపీఎస్ రద్దు అంటే..  కొత్త అర్ధాన్ని.. పరమార్ధాన్ని వివరిస్తూ..  ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అందులో సీ అంటే క్యాపిటల్... (రాజధాని అమరావతి)... పీ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్..  ఎస్ అంటే స్పెషల్ స్టేటస్.. (ప్రత్యేక హోదా) రద్దు చేస్తానని నాటి పాదయత్రలో వైయస్ జగన్ చెప్పారని.. కానీ తామే అర్థం చేసుకోలేకపోయామని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. ఏ యే పథకాలు ఎలా అమలు చేస్తామో వివరిస్తూ.. నాటి ప్రతిపక్ష నేతజగన్..  తన పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెడితే.. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని..  అలాగే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని..  అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అభివృద్ధికి బాటలు   వేస్తామని ఆయన ప్రకటించారు. అందుకే తాడేపల్లిలో ఇల్లు కూడా నిర్మించిన్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు.  

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అటు ప్రభుత్వ ఉద్యోగులు.. ఇటు అన్ని వర్గాల ప్రజలు గంపగుత్తగా జగన్ కు జై కొట్టారు. వైసీపీకి   ఓట్లు గుద్దేశారు. దాంతో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గద్దెనెక్కారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయలేదు సరికదా...  రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్ట పోయిన.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కూడా లేదు..  ప్యాకేజీ ఇస్తామని అప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో...  అలాగే ఓకే అంటూ సీఎం జగన్ మరో మాట మాట్లాడడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.  

ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి కాదని.. మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రిగా  జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు కొత్త పల్లవి అందుకోవడంతో.. రాజధానికి భూములు ఇచ్చిన ఆ ప్రాంత రైతులు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారు.  మరోవైపు రాజధాని అమరావతికి ఇచ్చిన భూములు నిరూపయోగంగా మారిపోయాయి. అలాంటి వేళ.. తాను అధికారంలోకి వస్తే..  సీపీఎస్ రద్దు చేస్తానంటే..  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అంతా అనుకున్నామని...  కానీ అది కాదని.. సీపీఎస్ రద్దు అంటే కేపిటల్, పోలవరం, స్పెషల్ స్టేటస్ రద్దుఅని తెలుసుకోలేకపోయామనీ  నెటిజన్లు  అంటున్నారు. అందుకు సంబంధించిన  ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu