మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం!

మొహంపై చెరగని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి బాధలో నున్న వారికైనా ఓదార్పునిస్తున్నారు నర్సులు. ఈ అపత్కాల సమయంలో నర్స్‌లే బాధితులకు కొండంత అండగా వుంటున్నారు. ప్రస్తుత కరోనా వైరస్‌ ‌కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్‌ ‌కట్టడికి వేల సంఖ్యలో నర్సులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలుసు. అయినా వారి లక్ష్యం ఒకటే. బాధితులను ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించడం.

ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ‌మహమ్మరిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స మరియు సంరక్షణను అందిస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. ప్రమాదం అంచున నిలబడి వైరస్‌ ‌బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నిరంతరం రోగుల మధ్యనే వుంటూ జబ్బులతో పోరాటం చేస్తూ వుంటారు. అంటు రోగాలతో సహవాసం చేస్తుంటారు. రాత్రి వేళల్లో సైతం డ్యూటీలు చేస్తుంటారు. పని ఒత్తిడిని ఎదుర్కోవడం, ఎదుటి వ్యక్తి బాధలను ఓపికగా వినడం వారికి వృత్తిలో అలవాటు అయిన లక్షణాలు. వారి ఓదార్పు మాటలు, సేవలు రోగులకు మనోధైర్యాన్ని ఆత్మ స్టైర్యాన్ని కలిగిస్తూ వారి జబ్బులను సగం నయం చేస్తున్నాయని చెప్పవచ్చు.

ఈ విపత్కర సమయంలో ఒక యజ్ఞం వలె సేవలందిస్తున్న నర్సుల సేవలకు వెలకట్టలేం. కరోనా సోకితే కన్న బిడ్డ నైనా తాకలేం. బంధువులైనా, ప్రాణ స్నేహితులైరా సరే దగ్గరికి రాలేరు. ఒక రకంగా ఒంటరైన పేషేంటుకు హాస్పిటలే దిక్కు. అలాంటి పేషేంట్‌ ‌దగ్గరకు ఆత్మీయంగా వచ్చి సేవలు అందించే వ్యక్తి అన్నీ తానై వ్యవహరించి అమ్మను మరిపిస్తుంది. కరోనా విలయంలో "అమ్మ"లా ఆదరిస్తూ,కనిపించే దైవాలుగా వైద్య సేవలు అందిస్తున్న "నర్సు" లందరికి శుభాకాంక్షలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu