తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాదా?

తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీ పరిస్థితిని రాష్ట్రంలో నానాటికీ దిగజారేలా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఈ అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అధిష్టానం జోక్యం కూడా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని మెరుగుపరచచడంలో విఫలమైంది. ఇప్పటికీ రాష్ట్రపార్టీలో ముఠాల కుమ్ములాటలు, గ్రూపు తగాదాలూ అలాగే ఉన్నాయి. నాయకుల మధ్య విభేదాలు క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బహిరంగంగా ఆ పార్టీ ఎంపీ నుంచే ఘోర పరాభవం, అవమానం ఎదురైంది. 

విషయమేంటంటే.. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం  పార్టీ సీనియర్లు, కీలక నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అవమానం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు పదే పదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పేర్కొన్నారు.  

ఒక సారి అయితే పొరపాటు అనుకోవచ్చు. కానీ రఘునందనరావు తన ప్రసంగంలో కనీసం అరడజను సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు. పరిశీలకులు, పార్టీ వర్గాలూ కూడా రఘునందనరావు ఉద్దేశపూర్వకంగా, రామచంద్రరావును అవమానించే  లక్ష్యంతోనే అలా మాట్లాడారని అంటున్నారు. రఘునందనరావు, రామచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామచంద్ర రావును అవమానించడం, చిన్నబుచ్చడమే లక్ష్యంగా రఘునందనరావు అలా వ్యవహరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News