ట్రంప్ ను భయపెడుతున్న భారత్ స్వదేశీ రక్షణ సామర్ధ్యం

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తమ ఘనతేనని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు అనే కంటే ట్రంప్  సొంత డబ్బా వాయించుకుంటున్నారు అనడమే కరెక్ట్.  ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పల్లో నిజముందో లేదో వేరే చెప్పవలసిన అవసరం లేదు.అగ్రరాజ్యం అధ్యక్షుడు అంతటివాడు చెప్పిన విషయాన్నే ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు అంటేనే, అందులో నిజం లేదని అర్థమౌతోందని దౌత్య రంగ నిపుణులు అంటున్నారు. 

నిజానికి  ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందే నిజం అయితే..  అందుకు సంబంధించి ఉభయ దేశాలు సంయుక్త ప్రకటన చేయాలి.  కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీ అమెరికా ప్రభుత్వం అయినా ఒక అధికారిక ప్రకటన చేసిందా అంటే అదీ లేదు.  ట్రంప్  స్వయంగా ట్వీట్ చేశారు. ఆ వెంటనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో అదే స్వరం ఎత్తుకున్నారు. మరో వంక కాల్పుల విరమణకు భారత్  పాకిస్థాన్ దేశాలు రెండూ అంగీకరించినా, అమెరికా  పాత్రను ఒక్క పాక్ మాత్రమే ప్రస్తావించింది.  భారత దేశం ఆ ప్రస్తావన చేయలేదని  అమెరికా పత్రికలే పెద్ద అక్షరాల్లో రాశాయి. అవును. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన వెంటనే అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్, అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. భారత్-పాకిస్థాన్ అధికారులు కాల్పుల విరమణను ధ్రువీకరించారు. అయితే.. పాకిస్తాన్ మాత్రమే ఇందులో అమెరికా పాత్రను ప్రస్తావించింది  అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. అంటే  ట్రంప్  క్లెయిమ్’ ను భారత దేశం అంగీకరించలేదనే నిజాన్ని అమెరికా పత్రిక స్పష్టం చేసింది. అయినా.. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నవ్వి  పోదురు గాక నాకేటి సిగ్గు అన్నచందంగా పదే పదే కాల్పుల విరమణ తన ఘనతేనని చాటుకుంటున్నారు. చాటింపు వేస్తున్నారు. నిజానికి అప్పుడే కాదు, ఇప్పటికీ భారత దేశం అమెరికా మధ్యవర్తిత్వం వాదనను  ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడమే కాదు, భారత్, పాకిస్థాన్ దేశాల డీజీఎంవోల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే కాల్పుల విరమణ నిర్ణయం జరిగిందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. 

అలాగే.. భారత విదేశాంగ శాఖ అధికారికంగానే జమ్మూ కశ్మీర్  విషయంలో మూడో దేశం ప్రమేయాన్ని అంగీకరించేది లేదని ప్రకటించింది. నిజానికి  భారత విదేశాంగ  మంత్రి జై శంకర్  పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని స్పష్టం చేశారు. కుండ బద్దలు కొట్టేశారు. మరోవంక  భారత దేశం తాత్కాలిక కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించింది. అందుకే.. ఇప్పుడు తాజాగా  కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించాలని, ఉభయ దేశాల సైనిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ పొడిగింపు క్రెడిట్  కూడా అగ్ర రాజ్య అధినేత ట్రంప్   తమ ఖాతాలో వేసుకుంటే వేసుకోవచ్చును కానీ..  కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు  వ్యవహారం గానీ, సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ భారత  దేశం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పాక్  కాళ్ళ బేరానికి వచ్చిన తీరును గానీ, గమనిస్తే ట్రంప్ సార్  గప్పాల ఘన కీర్తి ప్రపంచానికి తేట తెల్లంగా తెలిసి పోయింది.  

అయినా..  భారత దేశం మాటల ద్వారా, చేతల ద్వారా ఎంతగా స్పష్టం చేసినా..  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మాత్రం అదే పాట పాడుతున్నారు. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని  పదే పదే చెప్పుకుంటున్నారు. ఒకే అబద్ధాన్ని పది సార్లు చెపితే నిజం అవుతుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. ట్రంప్ నిరాధార ప్రకటనలతో ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారు. అయితే..  అగ్ర రాజ్యాధినేత  ట్రంప్ ఎందుకు ఒకే అబద్ధాన్ని పదే పదే వల్లే వేస్తున్నారు? ఎందుకు,  ఆ క్రెడిట్ కోసం అంతలా ఆరాట పడుతున్నారు?  అంటే..  అందుకు  ట్రంప్ వ్యహార సరళి, అగ్ర రాజ్య అహంకారంతో పాటుగా వచ్చిన వ్యక్తిగత దురహంకారం  సహా  ఇతర కారణాలు కూడా ఉంటే ఉండవచ్చును.  కానీ, మూడు రోజుల మినీ వార్’ ద్వారా భారత దేశం సైనిక సామర్ధ్యాన్ని ప్రపంచం ముందుంచింది. ఆర్థిక ప్రగతితో పాటుగా భారత దేశం సైనిక శక్తిగా ఎదుగుతున్న తీరు ప్రపంచం  కళ్లారా చూసింది. స్వదేశీ సాంకేతిక, సాయుధ శక్తిని ప్రపంచాని తెలిసింది. భారత దేశం సైనిక శక్తి రోజురోజుకీ పెరుగుతోంది. అ త్యాధునిక ఆయుధ సంపత్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో, రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ, శక్తి సామర్ధ్యాలు ప్రపంచం కళ్లకు సాక్షాత్కరించింది.  నిజానికి, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగలేదు. కానీ.. ఆపరేషన్ సిందూర్,  మూడు రోజుల మినీ వార్ ప్రపంచానికి  భారత దేశ శక్తి సామర్ధ్యాలను చాటి చెప్పింది. ఒక విధంగా అగ్ర రాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది. అందుకే..  ట్రంప్  భారత దేశం అజేయ శక్తిగా ఎదుగుతున్న నిజాన్ని జీర్ణించుకోలేక, అసలు విషయాన్ని పక్క దారి పట్టించేందుకే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ముఖ్యంగా భారత రాజకీయాల్లో వివాదాన్ని రాజేసి..  తద్వారా  భారత్ శక్తి సామర్ధ్యాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు  ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ కు వంత పాడుతున్నాయి. భారత్‌, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.?  అలాగే ఆపరేషన్‌ సిందూర్‌ ఎందుకు నిలిపివేశారో జవాబు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జైహింద్  ర్యాలీలు నిర్వహిస్తోంది. అయితే..  నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా..  మెల్ల మెల్లగా అసలు నిజం ప్రపంచానికి తెలుస్తోంది. భారత స్వదేశీ రక్షణ, సాయుధ సామర్ధ్యం, ఆధునిక సాంకేతిక సామర్ద్యాలతో  భారత్ అజేయ శక్తిగా ఎదుగుతోందనే నిజం ప్రపంచం గుర్తిస్తోంది. ఆ నిజమే అగ్రరాజ్య అధినేతను భయపెడుతోంది. అందుకే ట్రంప్  బడాయి మాటలకు ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu