భారత్ ప్రధాని మోడీకి పాక్ పత్రికల ప్రశంశలు, నవాజ్ కి చురకలు

 

భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోడి, నవాజ్ షరీఫ్ ఇద్దరూ ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడానికి అమెరికా చేరుకొన్నారు. మోడీ-షరీఫ్ అమెరికా పర్యటన గురించి పాక్ పత్రికలు అనేక కధనాలు ప్రచురించాయి. వాటిలో “ద నేషన్’ అనే ప్రముఖ పాక్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఈవిధంగా వ్రాసింది.

 

“ఒకప్పుడు అమెరికాలో కాలు పెట్టడానికి కూడా అనుమతి దొరకని నరేంద్ర మోడికి ఇప్పుడు అమెరికాలో ఒక సినిమా హీరోకి తీసిపోని స్థాయిలో ఘన స్వాగతం లభించింది. కానీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కేవలం ఐక్యరాజ్య సమితి వేదికపై మాత్రమే అలా మెరిసి మాయం అయిపోయారు. ఇద్దరూ న్యూయార్క్ నగరంలో వాల్దోర్ఫ్ అస్టోరియా హోటల్లోనే బస చేసారు. కానీ వారు సమావేశం కాలేదు.”

 

“భారత ప్రధాని నరేంద్ర మోడి సిలికాన్ వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ది పొందిన సంస్థల అధినేతలతో సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీ.ఈ.ఓ. సత్యం నాదెళ్ళ, గూగుల్ సీ.ఈ.ఓ. సుందర్ పిచ్చాయ్ వంటి వారితో సహా అడోబ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన 350మంది సీ.ఈ.ఓ.లతో మోడీ విందు సమావేశంలో పాల్గొని భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేసారు. సిలికాన్ వ్యాలీని ఈ స్థాయికి చేర్చిన భారత సంతతికి చెందిన మేధావులను, సాఫ్ట్ వేర్ నిపుణులను భారత్ ని అభివృద్ధి చేయమని గట్టిగా కోరారు.”

 

“మోడీ అమెరికాలో భారతీయులను, ప్రముఖ సంస్థలను భారతదేశంతో కనెక్ట్ చేయడానికి కృషి చేస్తుంటే మరి మన ప్రధాని నవాజ్ షరీఫ్ ఏమి చేస్తున్నారో తెలుసా? ఆయన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో మన దేశం గురించి మాట్లాడేందుకు ఉర్దూలో స్క్రిప్ట్ సిద్దం చేసుకొంటున్నారు. ఇది వినడానికి ఒక జోక్ లా ఉంది కానీ యదార్ధం మాత్రం ఇదే.”

 

“ఇద్దరు ప్రధానుల వ్యవహార శైలిలో కనబడుతున్న ఈ వ్యత్యాసం ద్వారా అర్దమవుతున్నది ఏమిటంటే వ్యక్తిగతంగా కానీ మరే విధంగానయినా గానీ అమెరికా తదితర దేశాలను మనం ఆకట్టుకొనేందుకు మన వద్ద ఏమీ లేదని. పాకిస్తాన్ ఏలికలు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడిని చూసి చాలా నేర్చుకోవలసి ఉంది. నరేంద్ర మోడి చాలా తెలివయిన రాజకీయ నాయకుడు. పరిస్థితులను బట్టి చాలా సమయానుకూలంగా అందరినీ ఆకట్టుకొనేలా మాట్లాడుతూ ప్రత్యర్ధులను చిత్తు చేస్తుంటారు. కానీ మన ఏలికలు మాత్రం ఎప్పుడూ తమ విజయాల గురించి ఊకదంపుడు వ్యర్ధ ప్రసంగాలు చేసి వస్తుంటారు.”

 

“భారత ప్రధాని మోడీ అమెరికాని క్రమంగా తనవైపు తిప్పుకొంటున్నారు. అమెరికా కూడా ఇప్పుడు భారత్ పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తోంది. పశ్చిమ దేశాలతో పాక్ అనుసరిస్తున్న వ్యవహార శైలిని తక్షణమే మెరుగుపరుచుకోవలసి ఉంది. లేకుంటే భారత్-అమెరికాలు చేతులు కలిపినట్లయితే పాక్ పూర్తిగా బలహీనపడిపోవడం తధ్యం. ఎంతో దృడమయిన పాక్ మిలటరీ కూడా అప్పుడు వారి శక్తి ముందు చిన్నబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి తన దేశాన్ని ఆసియా ఖండంలో రాజకీయంగా, రక్షణ పరంగా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం ఆయన వద్ద తగిన వ్యూహాలు ఉన్నాయి. కానీ మన వద్ద ఏమున్నాయి? ఆలోచించుకోవలసిన తరుణమిది.”