ఐఏఎస్‌లా? అటెండ‌ర్లా? జ‌గ‌న్ ద‌గ్గ‌ర మోకాళ్ల‌పై కుర్చోవ‌డ‌మేంటి?

ఐఏఎస్‌. కేంద్ర స‌ర్వీసు ఉద్యోగులు. దేశంలోకే అత్యున్న‌త కేడ‌ర్‌. అందులోనూ ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి అంటే మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌. అయితే ఏంటి? ఎవ‌రైనా, ఎంత‌టి వాడైనా.. జ‌గ‌న్ ముందు జీహుజూర్ అనాల్సిందేనా? రాజారెడ్డి రాజ్యాంగంలో అలా ఉందా? అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏపీలో లేటెస్ట్‌గా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌.. రాష్ట్రంలో ఐఏఎస్‌లు ఎంత దిగ‌జారిపోయారో చెప్పేందుకు సాక్షంగా నిలుస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం కూర్చున్నారు. అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. మ‌ధ్య‌లో ఓసారి సీఎం జగన్‌ పిలవగానే ప‌రుగున‌ వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. వేదిక‌పైనే మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు. అదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ ఘ‌ట‌నే ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. 

ఐఏఎస్‌లు స్వేచ్ఛ‌గా ప‌ని చేయాల్సిన అధికారులు. అలాంటిది.. జ‌గ‌న్ ముందు ముఖ్య కార్య‌ద‌ర్శి అంత‌టివారే ఇలా మోక‌రిల్లితే ఎలా?  మిగ‌తా ఉద్యోగుల‌కు ఎలాంటి సిగ్న‌ల్స్ వెళ‌తాయి? ఉద్యోగ స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్న‌ట్టు?  ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ తీరుపైనా.. ఆయ‌న్ను అలా దిగ‌జారేలా చేసిన జ‌గ‌న్‌పైనా.. ఐఏఎస్ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

గ‌తంలో తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలానే జ‌రిగింది. సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి.. ఓ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్క‌డం తీవ్ర కాంట్ర‌వ‌ర్సీగా మారింది. క‌ట్ చేస్తే.. ఆ వెంక‌ట్రామిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్‌లో చేరి.. ఎమ్మెల్సీ అయ్యారు. వెంక‌ట్రామిరెడ్డిలా కాళ్ల మీద ప‌డ‌కున్నా.. ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌ మోకాళ్ల‌పై కూర్చోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ ఐఏఎస్ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.