తెలిసీ అడుగేసినావే... ఎడారంటి ఆశల వెనుక!

బంగారం లాంటి జీవితాన్ని చేతులారా మట్టిపాలు చేసుకున్న మహిళ జీవితం ఇది. గుజరాత్ కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్‌కుమార్ ఆ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పేరు సూర్య జై. చీకూచింతా లేని కుటుంబం. కానీ, ఆమె బుర్రలో పుట్టిన పురుగు ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సూర్య జైకి సంవత్సరం క్రితం తమిళనాడుకు చెందిన ఒక గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆమె అతనితో కలసి వెళ్ళిపోయింది. ఎడారంటి ఆశల వైపు ఆమె వేసిన అడుగులు ఆమెని అధఃపాతాళానికి తీసుకెళ్ళాయి. ఆమె, ఆ గ్యాంగ్‌స్టర్ కలసి జులై 11న తమిళనాడులో ఒక బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ బాలుడి అదృష్టం బాగుండి పోలీసులు రంగప్రవేశం చేసి కాపాడారు. అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు వెతుకుతున్నారు. పోలీసు కేసులో ఇరుక్కోవడంతో సంవత్సరం తర్వాత సూర్య జైకి ఐఏఎస్ భర్త గుర్తొచ్చాడు. వెంటనే గుజరాత్‌కి ప్రయాణమైంది. డైరెక్ట్.గా ఇంటికి వెళ్ళింది. ఐఏఎస్ రంజిత్ కుమార్ అప్పటికే సూర్య జైతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను ఇంట్లో లేని సమయంలో సూర్య జై వచ్చినట్టయితే లోపలకి రానివ్వద్దని పనివాళ్ళకి అప్పటికే చెప్పాడు. దాంతో పనివాళ్ళు ఆమెని ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఆమె ఇంటి ముందే విషం తాగి, అంబులెన్స్ కోసం ఫోన్ చేసింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సూర్య జై మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా ఐఏఎస్ రంజిత్ కుమార్ నిరాకరించినట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu